CM KCR : కృష్ణా నదీ జలాల వివాదంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న కేసీఆర్‌

కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు మీటింగ్ కు స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.

CM KCR : కృష్ణా నదీ జలాల వివాదంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న కేసీఆర్‌

Cm Kcr

Krishna River Management Board : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 27న జరిగే కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశానికి స్వయంగా హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఈ సమావేశంలో ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు.. కేఆర్‌ఎంబీ, కేంద్ర ప్రభుత్వ తీరునూ తప్పుపడుతున్న సీఎం కేసీఆర్‌.. ఈ సమావేశంలో దీనిపైనా మాట్లాడే అవకాశముంది. ఇక కృష్ణా జలాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఆయన అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత నీటి కేటాయింపులు మొదలుకొని ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకు మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించారని మొదటి నుంచి కేసీఆర్ తప్పుబడుతూనే ఉన్నారు.

తెలంగాణలో 66 శాతం నది పరివాహక ప్రాంతం ఉంటే కేవలం 32 శాతమే నీటి కేటాయింపులు జరిగాయి. కాబట్టి దీనిపై పోరాటం చేయాలని మొదటి నుంచి భావిస్తున్నారు. గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కేసీఆర్ చేసిన వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే అందుకనుగుణంగా సుప్రీంకోర్టులో వేసిన కేసును సీఎం వినతి మేరకు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత కొత్త ట్రిబ్యునల్ కు సంబంధించి కేంద్ర ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ వాటర్ నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. దీనికి సంబంధించి ప్రతి రోజూ 3 టీఎంసీలకు సంబంధించి నీటిని లిఫ్టింగ్ చేయాలని పనులు చకా చకా జరుగుతున్నప్పటికీ కృష్ణా రివర్ బోర్డు, కేంద్రం కానీ ఆ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రతి రోజూ 3 టీఎంసీల నీరు తీసుకున్నట్లైతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులన్నింటిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా నాగార్జునసాగర్ కు కూడా చుక్క నీరు వెళ్లే అవకాశం ఉండదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ సమయంలోనే గట్టిగా నిలువరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమయంలో కనుక మన బాధను గట్టిగా వినిపించకపోతే తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల 27న జరిగే కేఆర్ఎంబీ మీటింగ్ కు స్వయంగా తానే హాజరవుతానని కూడా అధికారులకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లోనూ సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు సంబంధించి సగం వాటా.. అనగా మొత్తం 811 టీఎంసీలలో సగం నీటిని ఈ ఏడాది నుంచే తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను డాటా తీసి పెట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కాబట్టి ఈ నెల 27న జరిగే కేఆర్ఎంబీ మీటింగ్ కు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.