Yadadri CM KCR Tour, సూచనలు, ఆదేశాలు

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 07:23 PM IST
Yadadri CM KCR Tour, సూచనలు, ఆదేశాలు

Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్‌ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం పనులు కొనసాగుతున్నాయి.

ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు పూర్తి చేస్తున్నారు. దర్శన సముదాయం, ప్రసాద కాంప్లెక్స్… శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయానికి నలుదిక్కులా కృష్ణశిల రాతి విగ్రహాలు… సింహం, ఐరావతం, శంకు చక్రాలు, గరుత్మంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.



ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు అద్దనున్నారు. వీటితో పాటు ఆలయ నగరి, వీవీఐపీ వసతి కోసం ప్రెసిడెన్షియల్ సూట్స్, విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులన్నింటినీ ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

రింగు రోడ్డు, చెట్ల పెంపకాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. యాదాద్రి టెంపుల్‌ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న ఆయన..మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణ పనుల కోసం రూ.75 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. 5వేల కార్లు, 10 వేల బైకుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.



2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. బాలాలయంలోని కేసీఆర్‌.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ ఆలయ ద్వారం బయట నుంచే దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం పండితులు చతుర్వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.



ఆలయ చివరి దశ పనులతో పాటు.. అనుబంధ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తున్న ప్రసాదం కాంప్లెక్స్‌ భవనం పూర్తయ్యింది. కింది రెండు ఫ్లోర్లలో ప్రసాదాల తయారీ కోసం ఆధునిక పద్దతులతో వంటశాలను నిర్మించారు. నాలుగో అంతస్తులో ప్రసాద విక్రయాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ప్రాకార మంటపాల అంతర బాహ్య సాలహారాల్లో ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనాలను ఇటీవల శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పరిశీలించి ఫైనల్‌ చేశారు. సాలహారాల్లో నరసింహుడి బ్రహ్మోత్సవ రూపాలు, దశావతారాలు, అష్టలక్ష్మి, శ్రీకృష్ణుడి పలు అవతారాల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.



యాదాద్రి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అహ్లాదకరంగా మారింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు యాదాద్రి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని అధికారులు పెంపొందించారు. స్వామి వారి కొండను 108 రకాల మొక్కలతో హరితమయం చేశారు. సుమారు 22 కోట్లతో మొక్కల పెంపకం, గార్డెనింగ్‌ పనులు చేపట్టారు. అలాగే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కోసం రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు.