ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం, పెళ్లికి రావాలని కేసీఆర్ కు ఆహ్వానం

  • Published By: naveen ,Published On : October 19, 2020 / 02:46 PM IST
ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం, పెళ్లికి రావాలని కేసీఆర్ కు ఆహ్వానం

cm KCRs Adopted Daughter : తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆదివారం(అక్టోబర్ 18,2020) చరణ్‌ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల క్రితం పిన తల్లి చేతుల్లో వేధింపులకు గురై చావు బతుకుల మధ్య ఉన్న ప్రత్యూషను సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఆమె కోలుకున్నాక ఆమెను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని ఆమెతో భోజనం కూడా చేశారు. ఆమె సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది.

చరణ్‌ రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం:
ఐదేళ్లలో విద్య, ఆరోగ్యపరంగా ఎదిగిన ప్రత్యూష.. తనకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోబోతోంది. ఆదివారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో రాంనగర్ కి చెందిన చరణ్‌రెడ్డితో నిరాడంబరంగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ప్రత్యూషను కలిసి విషయం చెప్పడంతో ఆమె కూడా ఒప్పుకుంది. ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రత్యూషను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు సీఎం. ప్రస్తుతం నర్సింగ్ పూర్తి చేసిన ప్రత్యూష ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. తన వివాహానికి కచ్చితంగా వస్తానని కేసీఆర్‌ చెప్పారని ప్రత్యూష తెలిపింది.

2017లో కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావు బతుకుల మధ్య ప్రత్యూష:
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు. 2017లో కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావు బతుకుల మధ్య ప్రత్యూష ఆస్పత్రిలో చేరింది. అమ్మాయి గోడు విని చలించిన సీఎం కేసీఆర్.. అప్పట్లో హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. తర్వాత ఆమెను తన దత్త పుత్రికగా ప్రకటించారు.

ప్రత్యూష గురించి తెలుసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం:
మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యూషను సంప్రదించగా ఆమె అంగీకరించింది. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రత్యూషను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఆమె పెళ్లి చేసుకోబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్.. సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యూష నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యను సీఎం ఆదేశించారు. దీంతో కమిషనర్.. ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను పర్యవేక్షించారు.

ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ అండతోనే కోలుకున్నానని, తన వివాహానికి వస్తానని కేసీఆర్ తనతో చెప్పినట్లు ప్రత్యూష వెల్లడించింది. మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని ప్రత్యూష సంతోషం వ్యక్తం చేసింది.