నేడు నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన..హాలియాలో బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

నేడు నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన..హాలియాలో బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

CM KCR’s visit to Nagarjunasagar today : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటేదెవరు.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్న. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. అభ్యర్థిని ఖరారు చేయకున్నా… ఉప ఎన్నికకు శంఖారావం పూరించనుంది. ఇవాళ నల్లగొండ జిల్లా హాలియాలో గులాబీ బాస్ కేసీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల మండలి ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సాగర్ నియోజకవర్గం సిట్టింగ్ సీటు కావడంతో… ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ భారీగా వరాలు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నెల్లికల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరోవైపు… వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

అనంతరం.. హాలియాలో టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇక్కడి నుంచే కేసీఆర్ సాగర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రెండు లక్షలకు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. సభ సక్సెస్‌పై దృష్టిపెట్టారు.

సాగర్ బైపోల్ కోసం.. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. సీనియర్ నేత జానా రెడ్డి బరిలోకి దిగుతారని సంకేతాలిచ్చింది. మరోవైపు దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించిన వాటికంటే ఎక్కువ డివిజన్లు గెలిచిన బీజేపీ జోరు మీదుంది. ఈ పరిస్థితుల్లో… సాగర్‌లో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. మరోవైపు… నాగార్జునసాగర్ అభ్యర్థిగా ఎవరికీ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది.

ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉంది. నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి… ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరకో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగా ఉండడం…. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగే అవకాశం ఉండడంతో.. బలమైన నేతను రంగంలోకి దించాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ స్థాయిలో జనసమీకరణ చేస్తున్నారు. సభలో ఎంత మంది పాల్గొంటారనే దాన్ని బట్టి.. సాగర్ ఉపఎన్నికలో గులాబీ పార్టీ సన్నద్ధతపై ఓ అవగాహనకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపఎన్నికలు అంటేనే రెట్టించిన ఉత్సాహంతో పని చేసే టీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా చూసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.