ఎన్నికలు వస్తాయి..పోతాయి..నగరం శాశ్వతం- సీపీ అంజనీ కుమార్ వీడియో

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 10:07 AM IST
ఎన్నికలు వస్తాయి..పోతాయి..నగరం శాశ్వతం- సీపీ అంజనీ కుమార్ వీడియో

CP Anjani Kumar Video : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొందని, పార్టీలు ఓట్ల కోసం ప్రచారం చేపడుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు.



అయితే..ఈ క్రమంలో..కొంతమంది దుష్టులు ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారని తెలిపారు. అసలు ఎవరనీ నమ్మొద్దన్నారు. ఫేస్ బుక్ లో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, పాత వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తారన్నారు. ఎన్నికలు వస్తాయి..పోతాయి..కానీ..నగరం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని, ముందు పోలీసులతో మాట్లాడాలని సూచించారు. ప్రజలపై పూర్తిగా భరోసా ఉందని, అందరం కలిసి నగర ప్రతిష్ట మరింత పైకి తీసుకపోదామన్నారు సీపీ అంజనీ కుమార్.



https://10tv.in/media-bulletin-on-status-of-positive-cases-covid-19-in-telangana-3/
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది. పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా బీజేపీ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతోంది. వరద సాయం ఆపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారని టీఆర్ఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు.



భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని ఆయన సవాల్ విసరినప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎంఐఎం కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. పాతబస్తీ మీద సర్జికల్‌ స్ట్రైక్స్ చేసి పాకిస్తానీలు, రోహింగ్యాలను ఇక్కడి నుంచి తరిమితరిమి కొట్టే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నేతల మధ్య మాటలు తీవ్రత పెరుగుతూ వచ్చాయి. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగిస్తామని అక్బరుద్దీన్ ఓవై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది.ఘాట్ లు కూల్చివేస్తే..మరుక్షణమే దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.



ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో కొన్ని అరాచకశక్తులు రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర చేస్తున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. అలాంటి వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమన్నారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు.