TRS MLA సుంకే తీరుపై ఫిర్యాదులు : సార్… తీరు మార్చుకోండి అంటున్న చొప్పదండి లీడర్స్

TRS MLA సుంకే తీరుపై ఫిర్యాదులు : సార్… తీరు మార్చుకోండి అంటున్న చొప్పదండి లీడర్స్

TRS MLA Sunke Ravishankar : కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో అర్థం కావనేది ఓ టాక్‌. నేతల రూటే సెపరేటు అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌… ప్రోటోకాల్‌ పాటించట్లేదంటూ స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలంతా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గ్రూప్‌ రాజకీయాల గూడుపుఠాణితో ఒకరిపై ఒకరు వ్యూహా ప్రతివ్యూహాలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు చొప్పదండి నియోజకవర్గ నేతలు. తమ సత్తా ఏంటో ఎమ్మెల్యేకే రుచి చూపేందుకు స్థానిక నేతలు యత్నిస్తుంటే.., నేనేం తక్కువ తిన్నానన్నట్లు ఎమ్మెల్యే సైతం కయ్యానికి కాలు దువ్వుతున్నారట. పార్టీ నేతల మధ్య మొదలైన ఈ కలహాలు చివరకు ఎటు దారి తీస్తాయోననని గులాబీవర్గాల్లో గుబులు రేగుతోంది.

నేతల మధ్య అంతర్గత విభేదాలు : –
ఎమ్మెల్యే తమ చేతిలో స్టీరింగ్‌లా ఉండాలని స్థానిక నేతలనుకుంటుంటే.. తన కంట్రోల్‌లో లోకల్‌ నేతలు ఉండాలనుకుంటున్నారట సుంకే రవిశంకర్‌. ఈ తరహా వైఖరి, నేతల మధ్య అంతర్గత విభేదాలు, అధిపత్య పోరుతో రోజురోజుకు పార్టీ పరువు బజారునపడుతుందని క్యాడర్‌ కలవరపడుతోంది. స్థానిక నేతలకు, ఎమ్మెల్యే మధ్య దూరం పెరుగుతున్నా, పైకి మాత్రం తామంతా ఒకటే అనే బిల్డప్‌ ఇస్తున్నారట కానీ… అదంతా తుఫాను ముందు ప్రశాంతతే అంటున్నారు స్థానిక ప్రజలు.

చొప్పదండి మున్సిపల్ ఎన్నికలు : –
చొప్పదండి మున్నిపల్‌ ఎన్నికల్లో రవిశంకర్‌ ప్యానల్‌కు వ్యతిరేకంగా…సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష పార్టీతో జట్టుకట్టారు. తమ సభ్యులను గెలిపించుకున్నారు. ఎన్నికకు ఎక్స్‌అఫీషియో సభ్యునిగా హాజరైన ఎమ్మెల్యే ఎదుటే.. నేతలంతా వ్యతిరేకంగా ఓటు వేసి తమ పంతం నెగ్గించుకోవడం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతా చేసి చివరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా గెలిచినవారికి పత్రాలను ఇప్పించుకుని పరోక్షంగా చురకలేసేశారట. దీంతో ఎమ్మెల్యే ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. స్థానిక నేతలతో కలిసిపోవాల్సి వచ్చింది. ఇటీవల కరీంనగర్‌ గ్రంథాలయ ఛైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవిశంకర్‌ మధ్య ప్రోటోకాల్‌ పంచాయితీ కూడా తలెత్తింది.

ఇదేం రాజకీయం : –
నియోజకవర్గానికి చెందిన తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై ఏనుగు రవీందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూప్‌లను పెంచి పోషిస్తూ, సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించడం మంచిది కాదు సార్‌ అంటూ…. ఎమ్మెల్యేకు లైబ్రరీ ఛైర్మన్‌ ఓ స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చేశారు. ఇది పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జరిగిన తర్వాత మళ్లీ ఎమ్మెల్యే సెట్‌ అయ్యారు. దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండేసరికి…ఇదేం రాజకీయం రా బాబూ అంటూ నియోజకవర్గ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారట.  ప్రస్తుతం…గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి సర్పంచ్‌ విజయలక్ష్మి…ఎమ్మెల్యే రవిశంకర్‌పై మండిపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించారంటూ విజయలక్ష్మిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు మధ్య విబేధాలు : –
ఇదంతా చొప్పదండి ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే జరిగిందంటూ విజయలక్ష్మి ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బంధువు సర్పంచ్‌ కాకపోవడంతో..విజయలక్ష్మిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలూ వస్తున్నాయి. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు మధ్య విభేదాలు పొడచూపుతున్నాయట. రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లోని కొంతమంది నేతలకు… టీఆర్‌ఎస్ అధిష్టానంలోని కీలక నేతలతో సత్సంబంధాలున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పప్పులు ఉడకట్లేదంట. తానేం తక్కువ అన్నట్లు శాసనసభ్యుడు వ్యవహరిస్తున్నప్పటికీ.. లోకల్‌ లీడర్ల ముందు తగ్గే ఉండాల్సి వస్తోందంటున్నారు.