nagarjuna sagar bypoll : నాగార్జున సాగర్ ఉపఎన్నిక, ఎలాంటి రిస్క్ చేయని కాంగ్రెస్.. అభ్యర్థి ఆయనే

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ ప్రకటన చేశారు.

nagarjuna sagar bypoll : నాగార్జున సాగర్ ఉపఎన్నిక, ఎలాంటి రిస్క్ చేయని కాంగ్రెస్.. అభ్యర్థి ఆయనే

Congress Announce Candidate For Nagarjuna Sagar Bypoll1

congress announce nagarjuna sagar bypoll candidate: నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ ప్రకటన చేశారు.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని విజయం సాధించారు.

సాగర్ ఉపఎన్నిక బరిలో జానారెడ్డి కుమారుడు పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు సాగర్ ఉపఎన్నిక అందివచ్చిన అవకాశం కావడంతో ఎక్స్ పరిమెంట్లు చేయకుండా.. సీనియర్ నేత జానారెడ్డినే బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జానారెడ్డి రూపంలో బలమైన నేత సాగర్ బరిలో దిగడంతో ఉపఎన్నిక రసవత్తరంగా మారనుంది.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భగత్‌కు టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డిల్లో ఒకరికి టీఆర్ఎస్ అవకాశం ఇవ్వొచ్చునన్న ప్రచారం కూడా ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ తరుపున నివేదితా రెడ్డి, అంజయ్య యాదవ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల సంఖ్య తగ్గిన నేపథ్యంలో సాగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇక్కడా టీఆర్ఎస్ బోల్తా కొడితే రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే టీఆర్ఎస్ గెలిస్తే… ప్రజల్లో తమకు ఆదరణ తగ్గలేదని నిరూపించుకున్నట్లవుతుంది. సాగర్ ఉపఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో అటువైపు కన్నెత్తి కూడా చూడని ఆయన… సాగర్ ఉపఎన్నికకు రెండు నెలల ముందే హాలియాలో బహిరంగ సభ పెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు హామీలిచ్చారు. పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలకు గెలుపు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.

నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహిస్తారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.