10టీవీ లోగోతో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై అసత్య ప్రచారం, డీజీపీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు

  • Published By: naveen ,Published On : November 3, 2020 / 12:19 PM IST
10టీవీ లోగోతో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై అసత్య ప్రచారం, డీజీపీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు

congress complaint to dgp: తెలంగాణ కాంగ్రెస్‌ బృందం డీజీపీని కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10టీవీ లోగో వాడుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేశారని.. పోలింగ్ ప్రారంభమైన తర్వాతే ఫేక్ న్యూస్ ప్రచారంలోకి తెచ్చారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వివరించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఉత్తమ్ డిమాండ్‌ చేశారు. ఫేక్‌ న్యూస్‌పై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు ఉత్తమ్.

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చేశారని టెన్ టీవీ లోగోతో సోషల్ మీడియాలో కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది టెన్ టీవీ. అటు అసత్య ప్రచారాలపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అసత్య ప్రచారం టీఆర్ఎస్, బీజేపీ పనే అని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

ఓటు వేసిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు:
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిట్టాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. బొప్పాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీరి మధ్యనే నెలకొంది.

బరిలో 23మంది అభ్యర్థులు, నవంబర్ 10న కౌంటింగ్:
మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు 12.74 శాతం పోలింగ్ కాగా, 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ:
315 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఉన్నతాధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ కేడర్‌ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశమై అంతటా చర్చలు నడుస్తున్నాయి.