Huzurabad Bypoll : ఈటల వీటికి సమాధానాలు చెప్పాలి – కౌశిక్ రెడ్డి

Huzurabad Bypoll : ఈటల వీటికి సమాధానాలు చెప్పాలి – కౌశిక్ రెడ్డి

Congress Kaushik Reddy

Kaushik Reddy : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఆరోపణలు చేసిన ఈటలపై హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2018 ఎన్నికల్లో కౌశిక్‌‌కు కేసీఆర్ డబ్బులు పంపించారని అబద్ధపు ఆరోపణలు చేశారని, కొన్ని ఏళ్లుగా మంత్రిగా ఉన్నారు.. ఇంతకాలం నిద్రపోయారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2021, జూన్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆయన మీడియతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రాజీనామా చేసిన ఈటల..తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసే ముందు..గన్ పార్క్ కు వెళ్లిన ఈటల…ఏడున్నర ఏళ్లలో ఒక్కసారైనా వారి గురించి మాట్లాడావా ? ఒక్క కుటుంబాన్ని పరామర్శించావా ? అని నిలదీశారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు..సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని..అంటూ..కొత్త డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూమి కొనవద్దని తెల్వదా అని ప్రశ్నించారాయన.

కౌశిక్ రెడ్డి సంధించిన ప్రశ్నలు : –
‘ఒక్క ఎకరం భూమి అమ్మితే ఒక ఎలక్షన్ కొట్లాడుతా..రూ. 2 వేల కోట్ల భూమి ఎక్కడి నుంచి వచ్చింది ? రూ. 750 కోట్ల విలువ చేసే భూమి రామానాయుడు స్టూడియో వద్ద కొన్నాడు. ఇది ఎలా కొన్నారు ? 200 ఎకరాలున్నాయని ఈటల చెప్పారా ? లేదా ? ఒక్క ఎకరం రూ. 10 కోట్లు ఉంటుందని, నానక్ రామ్ గూడ చౌరస్తాలో 15 ఎకరాల భూమి ఎక్కడి నుంచి కొన్నావు ?

రూ. 750 కోట్ల ఆస్తి విషయంలో సమాధానం చెప్పాలి. రావల్ కోల్ విలేజ్ గ్రామంలో ఈటల కుమారుడు 2019లో భూమి కొన్నారు. రూ. 210 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ?
అసలు రాజీనామా ఎందుకు చేస్తున్నారు ? డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదనా ? దళితులకు మూడెకరాలు ఇవ్వన్నందుకా ? నిరుద్యోగులకు భృతి ఇవ్వన్నందుకా.. ఎందుకు రాజీనామా చేశారు ? హుజురాబాద్ నియోజకవర్గంలో ముదిరాజ్ బిడ్డలను ఎంత మందిని ఆదుకున్నారు ?’ అని కౌశిక్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ ఆట ఆడుతున్నారని విమర్శించారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్‌‌తో అంతా బాగా ఉండి అంతా పంచుకున్నప్పుడు ఆత్మగౌరవం ఎక్కడ పోయింది ? కేసీఆర్‌తో చెడితే ఆయనతో తేల్చుకో.. మధ్యలో తనను ఎందుకు లాగుతున్నారు ? యావత్ బీసీలు గమనించాలని సూచించారు. వచ్చే బై ఎలక్షన్స్‌‌లో హుజురాబాద్‌‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీకి నోటా కంటే తక్కువ వచ్చాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి హుజూరాబాద్‌‌లో టీఆర్ఎస్ ఓటు చీలుతుందని వెల్లడించిన కౌశిక్ రెడ్డి..ఇద్దరి పోటీ వల్ల .. కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌‌ను గెలిపించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

మంత్రి కేటీఆర్ ను కలవడంపై ఆయన సమాధానం ఇచ్చారు. క్లబ్ హౌస్ లో నిర్వహించిన దశదిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ వచ్చారని, అక్కడే తాను ఉన్నట్లు చెప్పారు. అయితే.. కారు దగ్గరకు వెళ్లి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి ఏదో చెబుతున్నట్లుగా ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఎస్.. కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

Read More : Andhra Pradesh : కరోనా కేసులు..24 గంటల్లో 6 వేల 952 కేసులు