V Hanumantha Rao : వైఎస్‌తో పోరాడాను.. రేవంత్ రెడ్డి జైలుకెళ్తే దిక్కెవరు?

కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వారికంటే ఇతర పార్టీల నుంసీ వచ్చినవారి పెత్తనమే పార్టీలో ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తంచేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు. రేవంత్ రెడ్డి అభిమానులు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని, తనకు ఇప్పటికే రెండుసార్లు ఫోన్ కాల్స్‌లో బెదిరింపులు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు హనుమంతరావు.

V Hanumantha Rao : వైఎస్‌తో పోరాడాను.. రేవంత్ రెడ్డి జైలుకెళ్తే దిక్కెవరు?

V Hanumantha Rao

Congress Leader V Hanumantha Rao: కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వారికంటే ఇతర పార్టీల నుంసీ వచ్చినవారి పెత్తనమే పార్టీలో ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తంచేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు. రేవంత్ రెడ్డి అభిమానులు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని, తనకు ఇప్పటికే రెండుసార్లు ఫోన్ కాల్స్‌లో బెదిరింపులు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు హనుమంతరావు. తనను ఎన్నిసార్లు తిట్టినా కూడా.. టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించలేదని, కనీసం ఖండించట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

కేవలం జానారెడ్డి మాత్రమే ఇది మంచి ఆనవాయితీ కాదని ఖండించారని, రేవంత్ ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అయితే కొడంగల్‌లో ఎందుకు ఓడిపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల్లో పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారని నిలదీశారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నాయకునికి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రెడ్డినే కొత్త పీసీసీగా నియమించాలని పార్టీ అనుకుంటే కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వాలన్నారు.

తనకు సొంత పార్టీలోనే రక్షణ లేదని, ఎప్పుడు ఎవరు దాడి చేస్తారోనని భయంగా ఉందన్నారు. రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ రెడ్డి ఏమి కాకముందే మాకు ఇంత ఇబ్బందిగా ఉంటే.. పార్టీ ప్రెసిడెంట్ అయితే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు దమ్ములేదా? పార్టీలోకి కొత్తగా వచ్చినవారే పార్టీ నడుపుతారా? పార్టీలో ఉండి ఎన్నో అవమానాలు భరిస్తున్నామని అన్నారు.

నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా పార్టీలో ఫైట్ చేశా.. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. నేను బీసీని కాబట్టే, గాంధీ భవన్‌లో ప్రెస్ పెట్టనివ్వట్లేదు. అగ్రకుల నాయకులే గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్‌లు పెట్టుకోవాలా? కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని అన్నారు. ఎవరు ఏంచేసినా.. ఎంత తిట్టినా.. నేను బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. రేవంత్ రెడ్డికి ఒకవేళ పీసీసీ పదవి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి జైలుకు పోతే పార్టీకి దిక్కెవరు? అని ప్రశ్నించారు.