Komatireddy : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భువనగిరి ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ పదవిని ఆశించి భంగపాటుకి గురైన ఆయన.. మరోసారి తన ధిక్కార స్వరం వినిపించారు.

Komatireddy : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy

Komatireddy sensational comments : భువనగిరి ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ పదవిని ఆశించి భంగపాటుకి గురైన ఆయన.. మరోసారి తన ధిక్కార స్వరం వినిపించారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు వెళ్లొద్దని టీపీసీసీ ఆదేశాలు జారీ చేసినా.. కోమటిరెడ్డి పట్టించుకోలేదు. సభకు హాజరైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

విజయమ్మ ఆహ్వానం పంపిన రోజే మూడు రోజుల కిందట మాటిచ్చానని చెప్పారు కోమటిరెడ్డి. వైఎస్‌ సంస్మరణ సభకు హాజరుకాకూడదని ఆదేశాలు ఇవ్వడం సరికాదంటూ తప్పుబట్టారు. సభకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చిన వారే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి కౌంటరిచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అని.. ఆయన సంస్మరణ సభకి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు కోమటిరెడ్డి. తమ పార్టీ నేతలు అంటూనే ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి మరీ కాళ్లు మొక్కి వస్తున్నారని.. అలాంటిది కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సంస్మరణ సభకి వెళ్లొద్దనడం సరికాదంటూ గట్టిగానే బదులిచ్చారు.

వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్ అన్నారాయన. వైఎస్‌ను మరింత దగ్గర చేసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు కోమటిరెడ్డి. విజయమ్మ ఆహ్వానం మేరకు.. వైఎస్‌ఆర్ వర్ధంతి సభకు వచ్చానన్నారు. ఇతర పార్టీల నాయకుల సంతాప సభకు వెళ్లే తాము.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సభకు హాజరవ్వడంలో తప్పేముందన్నారు.

వైఎస్ వర్ధంతి సభకు హాజరవ్వకూడదని కాంగ్రెస్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో తనకు తెలియదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభకు పొవద్దని ఆదేశాలు ఇవ్వడమనేది పిచ్చి చర్యగా అభిప్రాయపడ్డారు. అలాంటి ఆదేశాలు ఇచ్చిన వారు వెంటనే విత్ డ్రా చేసుకోవాలన్నారు.