రైతులకు వ్యతిరేకంగా కేసీఆర్.. మోడీతో చేతులు కలిపారు : రేవంత్ రెడ్డి

రైతులకు వ్యతిరేకంగా కేసీఆర్.. మోడీతో చేతులు కలిపారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy angry on KCR and Modi : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు పోరాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై పోరాటం చేయాలని చూశానని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను కేంద్రం నొక్కేస్తోందన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేసీఆర్ మోడీతో చేతులు కలిపారని విమర్శించారు. రైతులను నట్టేట ముంచి మోడీతో కేసీఆర్ జతకట్టారని మండిపడ్డారు. మంగళవారం (ఫిబ్రవరి 16, 2021) నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో ఆయన ప్రసంగించారు.

రైతు బిడ్డల ఆశీర్వాదాలు తనపై ఉన్నాయని రేవంత్ తెలిపారు. ఎంతమంది అడ్డుకోవాలని చూసినా తాను ఇక్కడి వరకు రాగాలిగానని చెప్పారు. రైతుల పక్షాన నిలబడిన అందరికీ ధన్యవాదాలన్నారు. అవసరమైన సమయంలో తెలంగాణ రైతులు తమ శక్తిని బయటకు తీస్తారని చెప్పారు. మోడీకి వ్యతిరేకంగా దేశం మొత్తం భారత్ బంద్ లో పాల్గొన్నదని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

మోడీ తీసుకొచ్చిన చట్టాల వల్ల జరిగే నష్టాలపై అందరూ ఆలోచించాలన్నారు. రైతు పండించే పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేయవన్నారు. మార్కెట్ యార్టులు ఎత్తేస్తే.. రైతులు పంటలు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. తాను ఎంపీని అయినా..ఎమ్మెల్యే అయినా ఒక రైతు బిడ్డనేనని చెప్పారు.

రైతులను అదానీ, అంబానీలకు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా అని అడిగారు. ఢిల్లీలో పోరాడుతున్న రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంట్ లో మందబలం ఉందని మమ్మల్ని ఎత్తి బయటవేశారని వాపోయారు. అందుకే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల మధ్య తిరుగుతున్నామని రేవంత్ చెప్పారు.

దళారులు అంటే ఎవరో కాదు..అదానీ, అంబానీలేనని చెప్పారు. మన భూముల్లోనే మనలను బానిసలుగా మార్చబోతున్నారని తెలిపారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు వచ్చాయని తెలిపారు. అందుకే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భూములు రేట్లు పెరిగాయని తెలిపారు. కన్నతల్లిలాంటి భూమిపైన కన్నేశారని ఆరోపించారు. పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు.

త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో నలుమూలలా తిరుగుతానని చెప్పారు. ఏఐసీసీ వద్ద అనుమతి తీసుకుని సునామీలా పర్యటిస్తానని తెలిపారు. కేసీఆర్ ను గద్దే దింపుతానని ధీమా వ్యక్తం చేశారు.