Cooking Gas Supply : తెలంగాణలో ఇంటింటికి వంట గ్యాస్‌ సరఫరా

వంటింటి గ్యాస్ అవసరాలు తీర్చేలా తక్కువ ధరకే గ్యాస్ అందించేలా ప్రణాళికలు రూపొందించి తెలంగాణ సర్కార్‌ కార్యరూపంలోకి తీసుకువచ్చింది.

Cooking Gas Supply : తెలంగాణలో ఇంటింటికి వంట గ్యాస్‌ సరఫరా

Cooking Gas Supply

Cooking Gas supply : గేటెడ్‌ కమ్యూనిటీలు.. అందులోనూ కాస్ట్‌లీ, మోడర్న్‌ కమ్యూనిటీలకే పరిమితమైన సౌకర్యం ఇప్పుడు వరంగల్‌ జిల్లా నర్సంపేట వాసులకు అందుబాటులోకి వచ్చింది. మహిళల కష్టాలు తీర్చే కొత్త స్కీం.. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఇక ఇప్పుడు పైప్‌ లైన్ల ద్వారా వంటింట్లోకి గ్యాస్‌ తరలిరానుంది. వాడినంత గ్యాస్‌కే బిల్లు చెల్లించడమే కాదు.. రోజురోజుకు గుదిబండలా మారుతున్న గ్యాస్‌ ధరలకు కళ్లెం పడనుంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో బృహత్తర ప్రణాళిక పురుడు పోసుకుంది. ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. రాష్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట వేదికగా మారింది. ప్రతి మహిళ మురిసి పోయే భారీ ప్రాజెక్టు రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది.

వంటింటి గ్యాస్ అవసరాలు తీర్చేలా తక్కువ ధరకే గ్యాస్ అందించేలా ప్రణాళికలు రూపొందించి కార్యరూపంలోకి తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్‌. ఇంటింటికి వంటగ్యాస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాదు.. అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇళ్లకే కాదు.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పైపులైన్ ద్వారా పీఎన్‌జీ వినియోగదారులకు.. లారీ, రైలు, ట్యాంకర్ల ద్వారా సీఎన్‌జీ వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరుగనుంది.ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు పైపులైన్ ద్వారా గ్యాస్ అందించే బృహత్తర పథకం అందుబాటులోకి తీసుకురానుంది.

Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఐదున్నర లక్షల ఇళ్లకు ఇంటింటికీ వంట గ్యాస్‌ కనెక్షన్లు రానున్నాయి. పది జిల్లాల్లో ఈ ప్రాజెక్టుకు అమలు అవనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కోటి ఇళ్లకు ఇంటింటికీ వంట గ్యాస్‌ అందించాలన్న లక్ష్యం మేరకు ఈ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పది జిల్లాల పరిధిలో 3,100 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 800 కిలో మీటర్ల మేర పైపులైన్ వేసి ఈ యూనిట్‌లో లక్ష ఇళ్లకు గ్యాస్‌ సరఫరా చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో పాటు‌, జనగాం, జయశంకర్‌ భూపాపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో మరో 800 కిలో మీటర్లు నిర్మిస్తారు. ఈ జిల్లాల్లో కూడా లక్ష ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు పనులు కొనసాగుతున్నాయి.

నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 1500 కిలో మీటర్లు నిర్మించి, మూడున్నర లక్షల ఇళ్లకు గ్యాస్‌ సరఫరా చేయనున్నారు. మొత్తం 80 ఫిల్లింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. తెలంగాణలో తొలిసారిగా నర్సంపేటలో ఇంటింటికి గ్యాస్ సరఫరా పనులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి ఓ కొలిక్కి తీసుకు వచ్చారు. తాను సివిల్ సప్లయ్స్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయించారు. ఇవాళ వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌.. ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సీఎన్‌జీగా పిలిచే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్.. ఇండస్ట్రీస్‌కు, వాహనాలకు వినియోగించగా.. పీఎన్‌జీగా పిలిచే పైప్డ్ నేచురల్ గ్యాస్ గృహావసరాలకు ఉపయోగపడుతుంది.

Telangana bamboo power: వెదురు నుంచి కరెంటు ఉత్పత్తి ..దేశంలోనే తెలంగాణ ఉద్యానశాఖ తొలి ప్రయత్నం

దేశంలోని ఇతర రాష్ర్టాలోనే కేవలం కొద్ది పట్టణాలలోనే ఈ పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న పీఎన్‌జీ, సీఎన్‌జీ గ్యాస్ సరఫరాల పద్ధతిని గత పది సంవత్సరాల నుంచి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. నేషనల్ పెట్రోలియం, నేషనల్‌గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సంస్థ దీనిని పర్యవేక్షిస్తోంది. అలాంటి సేవలు ఇప్పుడు నర్సంపేటలో అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ గ్యాస్ ప్రాజెక్టు రావడం వల్ల ప్రజలకు చాలా చౌకగా గ్యాస్ ఇంటికి చేరనుంది. 750 గ్రాముల గ్యాస్ ధర 25 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇది డోమాస్టిక్ గ్యాస్ ధర కంటే తక్కువగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా నేరుగా గ్యాస్‌స్టౌకి కనెక్షన్ ఇస్తారు. గ్యాస్ ఎంత వాడుకుంటున్నారో తెలిపేందుకు మీటర్ కనెక్షన్ కూడా బిగిస్తారు. కరెంటు వినియోగిస్తే ఎలాగైతే బిల్లు వస్తుందో .. అలా వినియోగించిన గ్యాస్‌కే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

గ్యాస్ అయిపోయిందనే సమస్య ఉండదు. బుకింగ్, రవాణా, ఆలస్యం సమస్యలు తలెత్తవు. కాకినాడలోని మల్లవరం నుంచి గుజరాత్‌ వరకు వెళ్తున్న ప్రధాన పైపులైన్ నిర్మాణం నర్సంపేట నియోజకవర్గం మీదుగా వెళ్తోంది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో ఇప్పుడు ఈ సేవలు నర్సంపేటవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా పూర్తయిన ఈ ప్రాజెక్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. వెంటనే నర్సంపేట పట్టణంలో ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా అందుబాటులోకి వస్తుంది. పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేసేందుకు పనులు పూర్తి చేసి ఆడబిడ్డలకు ప్రభుత్వం కానుకగా ఇస్తోంది. దీంతో పట్టణ ప్రజలకు ఆర్థికంగా లాభదాయకంతో పాటు కాలుష్య రహిత పట్టణంగా నర్సంపేటను తీర్చిదిద్దే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా దక్కింది.