AP-Telangana: చల్లబడిన తెలుగు రాష్ట్రాలు.. మరో రెండు రోజులు వానలు!

గత వారం రోజులుగా పెరిగిన వాతావరణానికి తోడు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త సేదదీరారు. బుధవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు తగ్గుముఖం పట్టి మబ్బులు ఆవరించాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ చల్లబడింది. ఇక బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది.

10TV Telugu News

AP-Telangana: గత వారం రోజులుగా పెరిగిన వాతావరణానికి తోడు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త సేదదీరారు. బుధవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు తగ్గుముఖం పట్టి మబ్బులు ఆవరించాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ చల్లబడింది. ఇక బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురవగా.. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి.

ఇక, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక ఏపీలో కూడా దాదాపుగా అన్ని జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలలో వాన దంచి కొట్టింది.

ఇక, వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. గురువారం ఉదయం వరకు కూడా కొన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణ చేయలేకపోయారు. అయితే.. వేసవి తాపం నుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.

మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు ఉపరితలద్రోణి ఏర్పడడం.. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడిన కారణంగానే తెలుగు రాష్ట్రాలలో ఈ వాతావరణం ఏర్పడగా.. మరో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో పలు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక జులై నెలలో ఓ మోస్తరుగా వర్షాలు కురిస్తే, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.