కరోనా తోక ముడిచినట్టేనా ? అక్టోబర్ గండం గడవాల్సిందే..జాగ్రత్త అంటున్న వైద్యులు

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 01:04 PM IST
కరోనా తోక ముడిచినట్టేనా ? అక్టోబర్ గండం గడవాల్సిందే..జాగ్రత్త అంటున్న వైద్యులు

Corona Cases Decline : కోరలు చాచిన కరోనా తోక ముడిచినట్టేనా..? రోజురోజుకి వైరస్ బలహీనపడుతోందా..? పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం సెకండ్‌ వేవ్‌కి సంకేతమా..? ఈ అనుమానాలు, సందేహాలు ఎలా ఉన్నా అక్టోబర్‌ నెలలో మరింత అలర్ట్‌గా ఉండాలంటున్నారు డాక్టర్లు. బయటకు వెళ్లినా జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిస్తున్నారు.



కరోనా నుంచి కోలుకునేవారు క్రమంగా పెరుగుతున్నారు. కాస్త ధైర్యం చేసుకుని జనం కూడా బయటకు వస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు అవసరాల కోసం ఎక్కడికైనా వెళ్తున్నారు. వైరస్‌ భయాలు దడ పుట్టిస్తున్నా.. జనజీవనం సాధారణ పరిస్థితులకు దగ్గరగా చేరుకుంటోంది. ప్రజారవాణా, వ్యాపార, వాణిజ్యాలు ఒక్కొక్కటిగా గాడిన పడుతున్నాయి. లాక్‌డౌన్‌లో పూర్తిగా స్తంభించిపోయిన రంగాలు.. అన్‌లాక్‌ వెసులుబాటుతో మునుపటి స్థితికి చేరుకుంటున్నాయి.



చైనాలో గత డిసెంబర్‌లో కరోనా కల్లోలం రేపింది. జనజీవితాన్ని స్థంభింపజేసింది. వేలమంది వైరస్ కోరల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డారు. కట్టుదిట్టమైన చర్యలతో నాలుగైదు నెలల్లోనే వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇండియాలో మార్చి నుంచి కరోనా కంగారు మొదలైంది. ఇప్పటిదాకా 69లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 6వేల మందికి పైగా మరణించారు.



వైరస్ విజృంభిస్తున్నప్పటికీ గత వారం రోజుల కిందట కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఒకటి రెండ్రోజులు కేసులు కాస్త పెరిగినా వాటికంటే కోలుకున్న వారి సంక్య ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. ఇదే జాగ్రత్తలు తీసుకుంటే కొన్నిరోజుల్లోనే కొత్త కేసులు అదుపులోకి రావడంతో పాటు యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గుతాయి. ఈ ఒక్క నెల గండం గడిస్తే కరోనా నుంచి దాదాపు బయటపడినట్టేనని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.



అధిక మాసం, పెళ్లిళ్ల సీజన్‌, దసరా పండుగతో జనం గుమికూడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన సమయంలో పట్టు విడిస్తే పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ ఒక్క నెల కరోనా రూల్స్‌ విధిగా పాటించాలంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు కంట్రోల్‌లో ఉండే ఆ తర్వాత వచ్చే పండుగల్లో ఫుల్‌ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చని సలహా చేస్తున్నారు.



కుటుంబం గడవాలంటే.. బయటకు వెళ్లక తప్పదన్న భావన పెరగడం మంచిదే అయినా అజాగ్రత్త తగదంటున్నారు. కేసులు తగ్గాయనో లేక మరో కారణంతోనో జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదంటున్నారు. కొవిడ్‌ సోకకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రికాషన్స్‌ తీసుకున్నామో.. అవి ఇకపై కూడా కొనసాగించాలంటున్నారు నిపుణులు. భయం వీడి బతుకుబాటలో నడవడం మంచిదే అయినా జాగ్రత్తలు పాటిస్తూ బయటకు వెళ్లాలంటున్నారు వైద్య నిపుణులు.