Telangana Lockdown : లాక్‌డౌన్‌ తో తెలంగాణలో కరోనా ముప్పు తప్పిందా ?

కరోనా సెకండ్ వేవ్‌ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్‌డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం...? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?

Telangana Lockdown : లాక్‌డౌన్‌ తో తెలంగాణలో కరోనా ముప్పు తప్పిందా ?

Telangana Lockdown

Telangana Lockdown : కరోనా సెకండ్ వేవ్‌ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్‌డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం…? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?

కరోనా వైరస్ ఫస్ట్‌వేవ్‌కు మించి సెకండ్ వేవ్‌లో అందరినీ బెంబేలిత్తిస్తోంది. ఓ వైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనా మాత్రం ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. అన్ని రాష్ట్రాలూ ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి జనాలను వైరస్ బారినుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా మే 12 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. కేసులను నియంత్రించేందుకు, కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

తెలంగాణలో ఏప్రిల్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఒకానొక దశలో కేసులు 10వేలు కూడా దాటాయి. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలపై దృష్టి పెట్టింది. దీంతో.. కొత్తగా వైరస్ బారిన పడే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత పదిహేను రోజుల నుంచి నమోదవుతున్న గణాంకాలు చూస్తే ఏ స్థాయిలో కేసులు తగ్గిపోయాయో సులువుగానే అర్థమవుతుంది.

ఎందుకంటే గత పదిహేను రోజులుగా కేసులు మూడు వేల లోపే నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా జన సంచారం తగ్గిపోవడంతో.. వైరస్ ట్రాన్స్‌మిట్ కూడా తగ్గిపోతోంది. మరో పదిహేను రోజుల్లో మంచి ఫలితాలే వస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు వాటి సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ కంట్రోల్‌లోకి రావడం అంటే.. మొదట టెస్టుల్లో పాజిటివిటీ రేట్‌ తగ్గుతుంది. ఆ తర్వాత ఆసుపత్రుల్లో సీరియస్‌ కేసుల అడ్మిషన్లు తగ్గుతాయి. చివరిగా మరణాలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం తెలంగాణలో మొదటి రెండు దశలు వచ్చేసినట్టే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడాన్ని బట్టి కరోనా కొంత నియంత్రణలోకి వచ్చినట్లేనని స్పష్టమవుతోందని అంటున్నారు.

తెలంగాణలో కరోనా కంట్రోల్‌లోకి రావడానికి లాక్‌డౌన్‌తో పాటు ఇంటింటి ఫీవర్ సర్వే మంచి ఫలితాలను ఇస్తోందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల బృందాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశ ఫీవర్ సర్వే చేపట్టారు. అందులో.. 80 లక్షల కుటుంబాలను సర్వే బృందాలు కలిసాయి. వారి నుంచి వివరాలు సేకరించారు. ఇందులో లక్షా 88వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. వారికి మందులు ఇవ్వడంతో పాటు ఎక్కువ లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు.

జ్వరం, జలుబు లాంటి లక్షణాలున్న వారికి వైద్యులతో సూచనలు అందించారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా వీరందరికీ ముందుగానే కోవిడ్ మెడికల్ కిట్లను అందించారు. అంతే కాకుండా.. రెండో దశ ఫీవర్ సర్వే కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

మరోవైపు… ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కరోనాపై సమీక్షలు నిర్వహిస్తూ.. కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేస్తున్నారు. ఆసుపత్రులకు కావాల్సిన మందులు, ఆక్సిజన్‌, ఇతర సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన సమకూర్చించింది తెలంగాణ ప్రభుత్వం. రెమ్‌డెసివిర్, టొసిలిజుమాబ్ ఇంజక్షన్లను సిద్ధం చేసుకుంది. బ్లాక్ ఫంగస్ కేసులు పెరగకుండా ఉండేందుకు గాంధీ, కోఠి ఈఎన్టీ ఆస్పత్రుల్లో రెండు నోడల్ సెంటర్లను ఏర్పాటు చేసింది.

ఇలా కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే… అందరికీ వ్యాక్సిన్ అందేలా ప్రయత్నాలు చేస్తోంది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుండటంతో.. మరో 15 రోజుల్లోనే కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి… సెకండ్ వేవ్ కంట్రోల్‌లోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.