తెలంగాణలో 471కి చేరిన కరోనా కేసులు…12 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.

10TV Telugu News

తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.

తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో మృతుల సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం 414 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరంతా గాంధీ ఆస్పత్రితోపాటు చెస్ట్‌, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న మొత్తం 665 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18మందికి పాజిటివ్‌ వచ్చింది. 

అయితే తెలంగాణలో కరోనా కాస్త శాంతించింది. బాధితుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. తొలుత రోజూ డబుల్‌ డిజిట్‌కు మించని కేసులు.. మర్కజ్‌ లింకుతో భారీగా పెరిగాయి. రోజూ పదుల సంఖ్యలో నమోదయ్యాయి. అత్యధికంగా ఒకరోజు 80మందికిపైగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మర్కజ్‌ వెళ్లొచ్చిన 1100మందికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. వీరిలోనే ఎక్కవ మంది కరోనా బారిన పడ్డారు. 

కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారంతా క్రమంగా కోలుకుంటున్నట్టు మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రెండు రోజుల్లో 70మందిని డిశ్చార్జి చేసే అవకాశముంది. మిగిలినవారు ఈనెల 22 వరకు కోలుకుంటారని ఆయన చెప్పారు.  ఇవాళ్టి నుంచి  తెలంగాణలో కేసులు తగ్గే అవకాశం ఉన్నదన్నారు. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయడంవల్లే కరోనా అదుపులోకి వస్తోందన్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గినా  ఎక్కడా రిలాక్స్‌ కావద్దని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ రోజురోజుకూ నియంత్రణలోకి వస్తోందని…మున్ముందు కేసుల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయన్నారు. నాలుగైదు రోజుల్లో సింగిల్‌ డిజిట్‌కు రావొచ్చని అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడిచేయడానికి ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆరు ల్యాబ్‌లు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదైనా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లుచేశారు. వైద్యసిబ్బందికి అవసరమైన ఐదు లక్షల ఎన్‌-95 మాస్కులు, 20 లక్షల సర్జికల్‌ మాస్కులు, 25 లక్షల హ్యాండ్‌ గ్లౌజ్‌లు,  ఐదు లక్షల పీపీఈ కిట్లను ఆర్డర్‌ చేసింది. అంతేకాదు.. నాలుగు లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లను సిద్ధంచేసేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లుచేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే ప్రధాన డ్రగ్స్‌ను కూడా ప్రభుత్వం పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తోంది.

కరోనా చికిత్సకోసం వెంటిలేటర్లు అత్యంత అవసరం. ఈ మేరకు ప్రభుత్వం 500 వెంటిలేటర్లకు ఆర్డర్‌చేసింది. డీఆర్డీవో అనుసంధానంతో మరో 500 వెంటిలేటర్లు, మెదక్‌ జిల్లాలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి మరో వెయ్యి వెంటిలేటర్లకోసం ఏర్పాట్లుచేస్తోంది. వీటితో ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 2200 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. 

తబ్లీగీ జమాత్‌ ఎఫెక్ట్‌తో దేశంలో చాలాచోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలవారీగా అత్యవసర క్వారంటైన్‌ కేంద్రాలు, ఆస్పత్రులను  వెంటనే ఏర్పాటుచేయాలని రాష్ర్టాలను ఆదేశించింది. కేంద్రం ఆదేశించడానికి ముందే, తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోగుల సంఖ్య పెరిగితే వైద్యం అందించడానికి అనువుగా క్వారంటైన్‌ కేంద్రాలను, హాస్పటిల్స్‌ సిద్ధంచేసింది. ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేసింది. 11,177 ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లను అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆయుష్‌ హాస్పిటల్స్‌, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను కలుపుకొని మొదటి విడతలో 4,777 బెడ్ల సామర్థ్యాన్ని ఇదివరకే అందుబాటులోకి తెచ్చింది

విదేశాల నుంచి వచ్చిన 25,931 మంది హోం క్వారంటైన్‌ నిన్నటితో ముగిసింది. ఇక మర్కజ్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారు 3,510 మంది ఉన్నారు. వారిలో కొందరికి పాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్నారు. మరికొందరి కరోనా నిర్ధారణ ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 1,400 మందికి నెగెటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతున్నవారు, ఫలితాలు రావాల్సిన వారు మినహా మిగిలిన వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్నీ కలిపి 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 

10TV Telugu News