Hyderabad Metro Train : హైదరాబాద్‌ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా?

తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలతో... హైదరాబాద్‌ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా.? గత లాక్‌డౌన్‌ మెట్రోకు ఎలాంటి నష్టాలు తీసుకొచ్చింది..? ఈ నేపథ్యంలో మెట్రో ముందున్న మార్గాలేంటి.?

Hyderabad Metro Train : హైదరాబాద్‌ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా?

Corona Effect Again On Hyderabad Metro Train

Corona effect again on Hyderabad Metro train : తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలతో… హైదరాబాద్‌ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా.? గత లాక్‌డౌన్‌ మెట్రోకు ఎలాంటి నష్టాలు తీసుకొచ్చింది..? ఈ నేపథ్యంలో మెట్రో ముందున్న మార్గాలేంటి.? కరోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్ మెట్రో కుదేలౌతోంది. మెట్రో ప్రారంభించిన కొత్తలో క్రమక్రమంగా రద్దీ పెరుగుతూ మూడు కారిడార్లు బిజీ అయ్యాయి. రద్దీ ఊపందుకుంటుందన్న తరుణంలో ఊహించని విధంగా లాక్‌డౌన్‌ పెట్టడంతో మెట్రోపై పిడుగులా పడింది.

దాదాపు ఐదు నెలలుపాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. దాంతో కోట్లరూపాయలు నష్టాలు వచ్చాయని పేర్కొన్నాయి మెట్రో వర్గాలు. అయితే లాక్‌డౌన్ తర్వాత మెలిమెల్లగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్ వేవ్ మళ్లీ మెట్రోపై ప్రభావం చూపేందుకు సిద్ధమైంది. పాజిటివ్ కేసులు పెరగుతుండటం.. ఏసీ ప్రయాణం కావడంతో మెట్రోలో ప్రయాణానికి నగరవాసులు వెనకడుగు వేస్తున్నారు.

కరోనా కంటే ముందు సగటున రోజుకు 4 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణం చేశారు. అప్పుడు నో లాస్ నో ఫ్రాఫిట్ లేకుండా మెట్రో నడిచిందని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ఇక.. అన్‌లాక్ తరువాత కొన్నాళ్లుగా సగటున రెండు లక్షలకు పైగా మంది మెట్రోలో ప్రయాణించారు. అయితే వేసవి ప్రారంభం కావడంతో ఆ సంఖ్య మరింతగా పెరుగుతుందని మెట్రో వర్గాలు భావించాయి. ఇంతలోనే సెకండ్ వేవ్ రూపంలో మరో పిడుగు పడింది. పబ్లిక్ బయటికి రావడానికి భయపడే పరిస్థితులు వచ్చాయి.

ఇక మెట్రో స్టేషన్లు, మాల్స్‌లలో ఏర్పాటు చేసిన షాపుల ద్వారా కూడా 45శాతం ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది ఎల్‌ అండ్‌ టీ. ఇప్పుడు రద్దీ తగ్గడంతో ఈ ప్రభావం వ్యాపార సముదాయాలపై పడుతుంది. తాజాగా తగ్గించిన టైమింగ్స్‌ కూడా మెట్రో ఆదాయంపై ప్రభావం చూపనుంది. రాత్రి 9గంటల 30నిముషాలకు బయలు దేరే లాస్ట్ ట్రైన్ సమయాన్ని కుదించి ఇప్పుడు రాత్రి 7గంటల 45నిముషాలకే ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి ట్రైన్ బయలు దేరేలా మార్పులు చేశారు.

ఇప్పటికే ఐటీ ఏరియాలోని ఉద్యోగులు చాలా మంది ఇంటి నుంచి పని చేస్తుండటంతో మాదాపూర్ మార్గంలో రద్దీ తక్కువగా ఉంది. ఇలానే ఉంటే మెట్రో రైల్ నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి నెలకోనే అవకాశం ఉందని నిర్వహణ సంస్థ ఆందోళనలో ఉంది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారీగా నష్టాలు వచ్చినట్లు చెబతున్నాయి మెట్రో వర్గాలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 318 కోట్ల రూపాయలు ఆదాయం రాగా…, 2019-20లో 598కోట్లు వచ్చింది.

2020-21లో 1000కోట్ల ఆదాయం అంచనా వేయగా అది మూడు వందల కోట్లు కూడా దాటనట్లు తెలుస్తుంది. అయితే.. పిపిపి విధానంలో చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ఒప్పందం ప్రకారం నష్టాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వ సాయం కోరుతూ లేఖలు రాసింది మెట్రో. లాక్‌డౌన్‌ ఆంక్షలతో నష్టాల బాట పడుతున్న మెట్రో.. ఇప్పుడు ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకుంది.