Corona Effect Treasury : తెలంగాణపై ఖజానాపై కరోనా ప్రభావం.. ప్రభుత్వ పథకాల అమలుకు అడ్డంకులు

దేవుడు వరమిచ్చినా...పూజారి కనికరించడు అన్న చందంగా మారింది తెలంగాణలో ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి.

Corona Effect Treasury : తెలంగాణపై ఖజానాపై కరోనా ప్రభావం.. ప్రభుత్వ పథకాల అమలుకు అడ్డంకులు

Corona Effect Treasury

Corona effect on Telangana state treasury : దేవుడు వరమిచ్చినా…పూజారి కనికరించడు అన్న చందంగా మారింది తెలంగాణలో ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి. కరోనా సంక్షోభంతో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పలు కార్యక్రమాలను తీసుకొస్తున్నప్పటికీ… కొన్ని అనుకోని పరిణామాలు వాటికి ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తితో… ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు, రైతులకు రుణమాఫీ నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ… తమ మేనిఫెస్టోలో… నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది.

నిరుద్యోగ యువత ఉద్యోగం పొందే వరకూ నెలకు 3 వేల 16 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ అది అమలు కాలేదు. దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరేళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతిని ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ తర్వాత పథకం అమలు చేస్తామని చెప్పారు. కానీ పరిస్థితి తారుమారైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎప్పుడు అమలు అవుతుందో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నిరుద్యోగ భృతి పొందేందుకు ఎవరు అర్హులో తేలలేదు. అంటే… అసలు ఎవరు నిరుద్యోగి అన్నది ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేదు. ఇందుకు సంబంధించి కొంత మంది IAS అధికారుల ప్యానెల్… గైడ్‌లైన్స్ రూపొందించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఎంప్లాయి‌మెంట్ ఎక్స్‌చేంజెల్‌లో 10 లక్షల మంది నిరుద్యోగులు నమోదై ఉన్నారు. అలాగే 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అర్హులైన 10 లక్షల మంది యువతకు నెలకు 3 వేల 16 రూపాయలు భృతి ఇవ్వాలన్నా… ఏడాదికి 3 వేల 600 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు చెబుతున్నారు.

రైతు రుణమాఫీలో భాగంగా లక్ష రూపాయల లోపు పంట లోన్లు మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు సన్నాహాలు చేశారు. మొత్తం 36లక్షల 80 వేల మంది రైతులు అర్హులని తేల్చారు. అందులో గతేడాది 2 లక్షల 96 వేల మంది రైతులకు చెందిన 25 వేల వరకు రుణాలపై 4 వందల 8 కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసింది. 202122 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం 5 వేల 225 కోట్లు కేటాయించింది. అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది.

గతంలో 25 వేల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి 25 వేల నుంచి 50 వేల రూపాయల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్‌. ఈ కేటగిరిలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం 4 వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ 25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్‌ను తయారు చేశారు. అంటే 25 వేల నుంచి లక్షలోపు రుణాలున్న వారందరికీ 25 వేలు మాఫీ అవ్వనుంది. ఈ ఆప్షన్‌ ప్రకారం చూస్తే 13 లక్షల 45 వేల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం 5 వేల వంద కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి సానుకూలంగా లేకపోవడంతో… రైతు రుణమాఫీ డబ్బులు విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఒక లక్షా 46 వేల మందికి సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలో కూడా జాప్యం జరుగుతోంది. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపిన పరిస్థితుల ప్రభావంతో మరింత జాప్యం కానున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణతో రాష్ట్ర ఆదాయానికి నెలకు 15 వందల కోట్ల రూపాయల వరకు గండి పడుతోంది. దీంతో పథకాల అమలులో మరికొంత జాప్యం జరిగే పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.