SBI : రాష్ట్రంలో 600మంది బ్యాంకు ఉద్యోగులకు కరోనా, ఎస్బీఐ కీలక నిర్ణయం.. ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్‌ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో బ్యాంకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సగం మంది ఉద్యోగులతోనే..

SBI : రాష్ట్రంలో 600మంది బ్యాంకు ఉద్యోగులకు కరోనా, ఎస్బీఐ కీలక నిర్ణయం.. ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్

Sbi Key Decision

SBI Key Decision : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్‌ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో బ్యాంకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సగం మంది ఉద్యోగులతోనే విధులు నిర్వహించనుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపటి(ఏప్రిల్ 22,2021) నుంచి ఈ నెల 30 వరకు తమ బ్రాంచీల్లో సగం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాశ్ మిశ్రా తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌బీఐకి చెందిన బ్రాంచీల్లో వందల మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి దశలో 2వేల మందికి పైగా ఎస్‌బీఐ ఉద్యోగులు కరోనా బారినపడగా.. రెండో దశలో ఇప్పటివరకు 600 మందికి వైరస్‌ సోకింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలున్న ఉద్యోగులు, లోన్‌ ప్రాసెసింగ్‌ విభాగం సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యమివ్వాలని ఖాతాదారులను మిశ్రా కోరారు. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలన్నారు. సాధారణ ఉష్ణోగ్రత కలిగి మాస్క్‌లు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్:
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ సర్కిల్‌లోని కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా హెల్ప్‌లైన్‌ నెంబర్ 040-23466233ను ఏర్పాటు చేసినట్లు మిశ్రా వెల్లడించారు. బ్యాంకు పని వేళల్లో ఈ నెంబర్ పని చేస్తుందన్నారు. బ్రాంచీలు తెరిచి ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు, ఇతర సందేహాల కోసం కస్టమర్లు ఈ నెంబర్ కి ఫోన్‌ చేయొచ్చన్నారు.

తెలంగాణలో ప్రమాదకర పరిస్థితులు:
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న(ఏప్రిల్ 20,2021) రాత్రి 8 గంటల వరకు 1,30,105 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 6వేల 542 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 20 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,887 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 46,488కి చేరింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 898 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(ఏప్రిల్ 21,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో కరోనా ప్రళయం:
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్‌ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్‌లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనాను ఎలా కట్టడి చేయాలో అర్ధంగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకున్నాయి. తాజాగా మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఒక్కరోజే దాదాపు 3లక్షల మంది కరోనా బారిన పడ్డారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.95లక్షల కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అదే సమయంలో 2వేల 023 మందిని కరోనా బలి తీసుకుంది. దేశంలో రోజువారీ మరణాలు 2వేలు దాటడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 2లక్షల 95వేల 041 మందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది.

ఇదే సమయంలో కొవిడ్‌తో 2023 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,82,553కి చేరింది. మరణాల రేటు 1.18శాతంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 519 మంది మరణించగా, ఢిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు సంభవించాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,57,538కి చేరుకుంది.