మానవత్వం ఎక్కడ : కలిచి వేసే దృశ్యం..రోడ్డు పక్కన భర్త మృతదేహంతో భార్య

మానవత్వం ఎక్కడ : కలిచి వేసే దృశ్యం..రోడ్డు పక్కన భర్త మృతదేహంతో భార్య

సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇది మరి ఎక్కువైంది. ఎవరైనా మరణిస్తే..కరోనాతో చనిపోయాడని భావిస్తూ..ముందుకు రావడం లేదు.

దీంతో అందరూ ఉన్నా ఒంటరి వాడైపోతున్నాడు. తమ వారు చనిపోయారని..సహకరించాలని కోరుకుతున్నా…మొఖం చాటేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి లంకలో కారుమూరి వెంకటేశ్వర రావు (42) భార్యతో నివాసం ఉంటున్నాడు. వీరికి చిన్న కుమారుడున్నాడు.

వెంకటేశ్వరరావు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పెదపులిపాక లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. 2020, ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మోపిదేవీలో రక్త సంబంధికులు ఉండడంతో డెడ్ బాడీని అక్కడకు తీసుకెళ్లారు. భార్య నాగలత ప్రైవేటు అంబులెన్స్ లో తీసుకొస్తోంది. కానీ విజయవాడలో కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో బంధువులు మృతదేహాన్ని కిందకు దించడానికి ఒప్పుకోలేదు.

చివరకు అంబులెన్స్ నిర్వాహకులు డెడ్ బాడీని కిందకు దించి వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి భర్త మృతదేహం వద్దే చిన్న కొడుకును పెట్టుకుని నాగలత ఉండిపోయింది. గుండెలు బాదుకుని ఏడ్చింది. కాపాడాలని వేడుకుంది. ఎవరూ ముందుకు రాకపోవడం కలిచివేసింది. చివరకు విషయం తెలుసుకున్న వీఆర్వో మత్తి గోపాల కృష్ణ, ఎస్ ఐ మోపిదేవి, ఇతర అధికారులు అక్కడకు చేరుకున్నారు. పెనుమలూరు పోలీసులతో ఎస్ ఐ చర్చించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడకు పంపారు.