తెలంగాణలో కరోనాపై హైఅలర్ట్.. ఆసుపత్రులను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

తెలంగాణలో కరోనాపై హైఅలర్ట్.. ఆసుపత్రులను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

Telangana Corona High Alert

Telangana Corona High Alert : తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. డీఎంహెచ్ వో లతో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పది అంతకు మంచి బెడ్లు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స అందించేలా డీఎంహెచ్ వో లకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1691 నర్సింగ్ హోమ్స్ లో 41వేల బెడ్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వీటిలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 10వేలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 5వేల ఐసీయూ వెంటిలేటర్లు, 1500 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మరోవైపు ప్రజలందరు కరోనాపై మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైద్య సిబ్బంది మరికొన్ని రోజులు యుద్దప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలన్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో ఉన్న ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఉన్న డాక్టర్లు కరోనా వైరస్ రోగులను గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు.

వాక్సినేషన్ తో పాటు, ఇతర వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయి డాక్టర్లకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఆశా వర్కర్లకు, ప్రాథమిక ఆరోగ్య స్థాయి డాక్టర్లకు, సిబ్బందికి అవసరమైన పర్సనల్ కేర్ ఎక్విప్మెంట్ లు సకాలంలో అందేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాల్లో టెస్టు కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.