తెలంగాణలో కరోనా : రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షలు, కరోనా టెస్టులు తప్పనిసరి

తెలంగాణలో కరోనా : రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షలు, కరోనా టెస్టులు తప్పనిసరి

Corona in Telangana : దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ సరిహద్దుల్లో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షల్ని కట్టుదిట్టం చేస్తున్నారు. కరోనా పేషెంట్లను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్ట్‌లు తప్పనిసరిగా చేయాలని నిర్ణయించారు.

ఆ రాష్ట్రాల్లో కేసులు :-
మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగేకొద్దీ తెలంగాణలో కలవరం ఎక్కువైపోతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. అటు కర్నాటకలోనూ పెరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల చెక్‌పోస్ట్‌ల వద్ద, కర్నాటక సరిహద్దుల్లోని జహీరాబాద్‌ చిరాజ్‌పల్లి చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు తెలంగాణ అధికారులు. రాకపోకలు కొనసాగిస్తున్న అందరికీ థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు.

టెస్టులు :-
మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ వాసులు ఏదో పనిమీద వెళ్లి వస్తుంటారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలు వ్యాపారులు ముంబయికి వెళ్తుంటారు. బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, రెంజల్‌, నవీపేట మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్వహించే సంతలకు మహారాష్ట్ర నుంచి వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. రైళ్లు, బస్సుల్లో వచ్చేవారికయితే లెక్కేలేదు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చెక్‌పోస్ట్‌ల వద్ద హై అలర్ట్ ప్రకటించిన అధికారులు మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి టెస్ట్‌లు చేస్తున్నారు.

క్వారంటైన్ :-
మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలకు కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కువమంది రాకపోవడంతో టెస్ట్‌ల సంఖ్యను తగ్గించారు. అయితే ఇప్పుడు మళ్లీ టెస్ట్‌లను పెంచారు ఆయా జిల్లాల్లోని వైద్యాధికారులు. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. సాలూరా- సలాబాత్‌పూర్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద కరోనా నిర్థారణ పరీక్షలు చేపట్టారు.

రైల్వే స్టేషన్లు :-
టెస్ట్‌ల్లో పాజిటివ్‌ అని తేలితే వెనక్కి పంపిస్తున్నారు. మరోవైపు పొరుగురాష్ట్రాల నుంచి తెలంగాణ జిల్లాల్లోకి వచ్చే రైలుప్రయాణీకులకు వారు దిగే రైల్వేస్టేషన్లలో టెస్ట్‌లు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.