తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్… హైదరాబాద్ లో రెండు, వరంగల్ లో ఒక కేసు గుర్తింపు

తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్… హైదరాబాద్ లో రెండు, వరంగల్ లో ఒక కేసు గుర్తింపు

Corona new strain entering Telangana : బ్రిటన్‌ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ తెలంగాణలో ప్రవేశించింది. హైదరాబాద్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు రెండు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండ వ్యక్తికి కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా స్ట్రెయిన్ కేసులతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. కాసేపట్లో తెలంగాణ వైద్య శాఖ ముఖ్య అధికారులు సమావేశం కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రెండు యూకే స్టెయిన్ కేసులను అధికారులు గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ద్వారా కరోనా స్ట్రెయిన్ కేసులను నిర్ధారించారు. యూకే స్ట్రెయిన్ కేసుల నమోదు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై వైద్య శాఖ ముఖ్య అధికారులు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు మొత్తం ఆరు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైదరాబాద్ రెండు, బెంగళూరులో మూడు, పూణెలో ఒక కేసు నమోదయింది. జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ద్వారా కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్‌లో ప్రవేశించినట్టు నిర్ధారించారు. యూకే నుంచి తిరిగొచ్చిన 20 మందికి సంబంధించిన కరోనా పాజిటివ్‌ శాంపిళ్లను సీసీఎంబీ విశ్లేషించి, నివేదిక రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.

కరోనా స్ట్రెయిన్‌ సోకిన ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. ఆరుగురితో టచ్‌లో ఉన్న వారు క్వారంటైన్‌కు వెళ్లాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. వారితో ప్రయాణించిన వాళ్లు, కుటుంబ సభ్యులను తక్షణమే గుర్తించి.. వైద్య పరీక్షలు చేయించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

భారత్‌లో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే అప్పటికే భారత్‌కు చేరుకున్నవారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు సోకింది కొత్త రకమా? కాదా? అన్నది నిర్థారించేందుకు.. రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపించారు. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్త రకం వైరస్‌లను గుర్తించారు.

కేంద్రం చెబుతున్నదాని ప్రకారం నవంబర్‌ 25 నుంచి డిసెంబర్ 23 వరకు బ్రిటన్ నుంచి 33వేల మంది భారత్‌ వచ్చారు. వివిధ రాష్ట్రాల ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి నెగిటివ్ వచ్చిన ప్రయాణికులను అనుమతించారు. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 114మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆరుగురిలో కరోనా స్ట్రైయిన్‌ లక్షణాలను గుర్తించిన అధికారులు.. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఇంకా ఎవరికైనా సోకిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేసేందుకు రెడీ అవుతున్నారు.