Telangana Night Curfew : రాత్రి కర్ఫ్యూ ద్వారా కరోనా కేసులను తగ్గించవచ్చు : డీహెచ్ శ్రీనివాసరావు

నాలుగు, ఐదు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా పాజిటివ్ కేసులను తగ్గించవచ్చని చెప్పారు.

Telangana Night Curfew : రాత్రి కర్ఫ్యూ ద్వారా కరోనా కేసులను తగ్గించవచ్చు : డీహెచ్ శ్రీనివాసరావు

Telangana Night Curfew

Night Curfew in Telangana : తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. పాక్షిక లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా పాజిటివ్ కేసులను తగ్గించవచ్చని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. నాలుగు, ఐదు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రిళ్లు ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి..కేసులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి పాజిటివ్ కేసులను నియంత్రించేందుకు రాత్రి కర్ఫ్యూ ఉపయోగపడుందన్నారు. కరోనా కేసులు పెరుగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులపై భారం పడుతుందని.. దీన్ని తగ్గించుకోవాలని సూచించారు. కొత్త ఇన్ ఫెక్షన్స్ తగ్గించుకోవాలని దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈరోజు 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 30 వరకు కూడా కర్ఫ్యూ అమలులో ఉంటుందని చెప్పారు.

అయితే, కర్ఫ్యూ పెట్టినంత మాత్రాన ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎసెన్షియల్ సర్వీసులను కంటిన్యూ చేస్తారని…ప్రత్యేకంగా ఫార్మసీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తాయని చెప్పారు. ఇలాంటి సర్వీసులకు ప్రజలు ఎప్పుడైనా బయటికి రావొచ్చన్నారు. రోగులను ట్రాన్స్ పోర్టు చేసేందుకు వాహనాలకు అనుమతించారని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు డిపార్ట్ మెంట్ మానిటర్ చేస్తారని చెప్పారు. ప్రజలు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. నిబంధనలు పాటించినట్లైతే కరోనా కేసులను అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

బార్లు, పబ్స్, రెస్టారెంట్లకు రాత్రిళ్లు యువకులు అధికంగా వెళ్తుంటారని..వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…వైరస్ వేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. వారికి సోకడంతో కుటుంబ సభ్యులకు కూడా కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. కాబట్టి యువకులు పది రోజులు సంయమనం పాటించి జాగ్రత్తగా ఉంటే రాష్ట్రాన్ని, ప్రజలను కరోనా సెకండ్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు రాత్రిపూట హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ కు వెళ్లడం ద్వారా కరోనా కేసులు అధికమవుతున్నాయని చెప్పారు.
బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలని, ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అధిక సంఖ్యలో జనాలు గుమికూడవద్దన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ను తక్కువ సంఖ్యలో కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా తగ్గుదల ప్రారంభమైంది…రాబోయే రోజుల్లో మరింత తగ్గుదలను చూస్తామని చెప్పారు. అతి త్వరలో కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి రాష్ట్రం, ప్రజలు బయటపడేందుకు అవకాశం ఉందన్నారు.