Corona positive : తెలంగాణ స్కూళ్లపై కరోనా పంజా…400కు పైగా విద్యార్థులకు పాజిటివ్

తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో 400 నుంచి 500 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు.

Corona positive : తెలంగాణ స్కూళ్లపై కరోనా పంజా…400కు పైగా విద్యార్థులకు పాజిటివ్

Corona Positive

Corona positive for over 400 students : తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో 400 నుంచి 500 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు స్కూళ్లల్లో విద్యార్థులు, టీచర్లు కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. లేడీస్‌ హాస్టల్‌లో ఉంటున్న ఆరుగురు పీజీ విద్యార్ధినులు కోవిడ్‌ బారినపడ్డారు. వారిని కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.

జగిత్యాల జిల్లాలోని భవానీనగర్‌ సాంఘిక సంక్షేమ పాఠశాలలో 19 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారందర్నీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న రంగంపేట జడ్పీ హైస్కూల్‌లో ఓ టీచర్‌కు వైరస్‌ సోకింది. దీంతో స్కూల్లోని 70 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పదుల సంఖ్యల పిల్లలకు వైరస్‌ సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మేడ్చల్‌ జిల్లా కొత్తపేట స్కూల్లో ఓ టీచర్‌కు పాజిటివ్‌ రావడంతో .. విద్యార్థులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జెడ్పీహై స్కూల్ లో 8 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 25 మందికి, హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్టీ హాస్టల్ లో 22 మందికి, కామారెడ్డి జ్యోతి బాపూలే విద్యాలయంలో 13 మందికి, బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్టీ బాలికల హాస్టల్ లో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. టీచర్లూ పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు.

స్కూళ్లు, హాస్టల్స్ లో కరోనా ప్రబలుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని రెండు పాఠశాలలు, రెండు రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతి గృహంలోని నిర్వహించిన పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 28 మంది విద్యార్థులు, హాస్టల్‌ వార్డెన్‌, వాచ్‌మెన్‌, ఉపాధ్యాయుడు ఉన్నారు.

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో 76 మందికి విద్యార్ధులకు కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా.. 16 మందికి పాజిటివ్‌గా తేలింది. మొన్న బాలికల పాఠశాలలో 52 మంది కరోనా బారినపడ్డారు. దీంతో డీఈఓ మూడు రోజులపాటు స్కూల్‌కు సెలవులు ప్రకటించారు. మల్కాజ్‌గిరి- మేడ్చల్‌ జిల్లాలోని నాగోల్‌లో మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 పాజిటివ్‌ కేసులొచ్చాయి. కామారెడ్డి జిల్లా కస్తూర్బా గాంధీ స్కూల్‌లో 32 మంది విద్యార్థినిలకు వైరస్ సోకింది.

కరోనా ఎఫెక్ట్‌తో చాలా కాలం స్కూళ్లు మూతపబడ్డాయి. ప్రత్యామ్నాయంగా.. ఆన్‌లైన్ విద్యకు మొగ్గు చూపారు. ఇక, కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి కాలేజీలు, స్కూల్లు ప్రారంభం అయ్యాయి. కానీ, మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు ఇప్పుడు కొత్త టెన్షన్ పెడుతున్నాయి. స్కూల్స్‌పై కరోనా ప్రతాపం చూపుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్‌ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్స్‌ మూసివేత దిశగా ఆలోచన చేస్తోంది. తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు కేసీఆర్.