హైదరాబాద్ వాసులను వణికిస్తున్న కరోనా.. ఇళ్లకే పరిమితమవుతున్న జనం

కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు.

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 03:35 PM IST
హైదరాబాద్ వాసులను వణికిస్తున్న కరోనా.. ఇళ్లకే పరిమితమవుతున్న జనం

కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు.

కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. బిజినెస్ ప్లేసెస్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సందడిగా ఉండే ప్రాంతాలు జనం లేక వెల వెల బోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామందిలో రకరకాల భయలు పెరిగాయి. ఇప్పటికే హోటల్స్‌ లో బిజినెస్ తగ్గగా.. చిరువ్యాపారులు వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించిన నగరవాసులు  
కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు. ఒకవేళ తిరగాల్సి వచ్చినా మాస్క్‌లు, కర్చీఫ్‌ల వంటివి ఉపయోగిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు శుచికి, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బయటి ఆహారం తినేందుకు ఇష్టపడటం లేదు. గతంలో వీకెండ్స్ తో పాటు ఇతర రోజుల్లోనూ హోటళ్లు, రెస్టారెంట్లు జనంతో కిటకిటలాడేవి. నగర వాసులు బయటి ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు వచ్చింది. కరోనా భయాలతో ఇంటి ఫుడ్ కే ప్రాధాన్యం ఇస్తుండటంతో నగరంలోని చిన్నా చితక టిఫిన్ సెంటర్లు గిరాకీలు లేక వెలవెలబోతున్నాయి. కరోనా కారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నదని చిన్న టిఫిన్ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పార్కుల వద్ద తగ్గిన జన సాంద్రత 
కరోనా వైరస్‌ నేపథ్యంలో పార్కుల వద్ద జన సాంద్రత తగ్గింది. కరోనా భయంతో ప్రజలు తరచూ బయటకి వెళ్లే విధానానికి స్వస్తి పలికి అధిక సమయం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో  జనసంచారం తగ్గింది. నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్, ఐమాక్స్, లుంబినీ పార్కులు నిత్యం సందర్శకులతో కిటకిటలాడేవి. కరోనా నేఫథ్యంలో పార్కులు , సినిమా థియేటర్లు మూసివేయడంతో తమకు గిరాకీలు లేకుండా పోయాయని.. ఎన్టీఆర్ మార్గ్ లో టిఫిన్లు, తినుబండారాలు, సోడాలు అమ్ముకునే చిరువ్యాపారులు వాపోతున్నారు. దీంతో తమ కుటుంబాన్ని పోషించడం కూడా భారంగా మారుతోందంటున్నారు. 

హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల వ్యాపారులపైన కరోనా ఎఫెక్ట్  
హోటళ్లు, టిఫిన్ సెంటర్లపైనే కాదు… కరోనా ఎఫెక్ట్ పండ్ల వ్యాపారులపైనా పడింది. కరోనా భయంతో పండ్లు కొనేందకు జనం భయటకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఒక్క రోజులో అమ్మే పండ్లు 3 రోజులు అయినా అమ్ముడు పోవడం లేదని… పండ్లు పాడయిపోవడంతో తాము నష్టపోతున్నామని ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా ప్రభావం చిరువ్యాపారులను చిన్నాభిన్నం చేస్తోంది. వ్యాపారాలు లేక తమ బతుకుబండి నడిచేదే కష్టంగా మారింది. ఈ పరిస్థితి ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.