సీతారాముల కల్యాణం : భక్తులెవరూ రావద్దు..ప్రత్యక్ష ప్రసారంలో చూడండి

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 02:00 AM IST
సీతారాముల కల్యాణం : భక్తులెవరూ రావద్దు..ప్రత్యక్ష ప్రసారంలో చూడండి

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్త ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఒక్కసారైనా కల్యాణాన్ని వీక్షించాలని అనుకున్న భక్తులకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కరోనా మహమ్మారి వీరి సంతోషాన్ని దూరం చేసింది. రామయ్య కల్యాణాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

దీంతో భద్రాద్రిలో నిత్య కల్యాణ మండపంలోనే 30 నుంచి 40 మంది సమక్షంలోనే 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం జగత్ కల్యాణాన్ని నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. 

భక్తులెవరూ రావొద్దు..కేవలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో మాత్రమే చూడాలని సూచిస్తున్నారు. కల్యాణానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి సమర్పించనున్నారు. బుధవారమే రమణాచారితో కలిసి భద్రాచలానికి చేరుకున్నారు. నిరాడంబరంగా జరుగుతుందని తాను ఊహించలేదని, నెక్స్ట్ ఇయర్..ఎంతో ఘనంగా కల్యాణ వేడుకలు జరుపుకుందామన్నారు రమణాచారి. 

* గురువారం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పూజలు నిర్వహించనున్నారు. 
* అభిజిత్ లగ్నం సమీపించగానే..జీలకర్ర బెల్లాన్ని సీతారాముల వారి శిరస్సులపై ఉంచుతారు. 
* బుధవారం రాత్రి 7 గంటలకు ఎదుర్కొలు ఉత్సవం వైభవంగా జరిగింది. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, కమీషనర్ అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Also Read | కరోనా వైరస్ వ్యాప్తి విస్తరణను దాచిపెట్టిన చైనా : యుఎస్ ఇంటెలిజెన్స్