కరోనా వ్యాక్సిన్, తెలంగాణలో మొదట వీరికి మాత్రమే

  • Published By: madhu ,Published On : October 8, 2020 / 08:09 AM IST
కరోనా వ్యాక్సిన్, తెలంగాణలో మొదట వీరికి మాత్రమే

Coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. వాక్సిన్ కోసం ప్రపంచ దేశాల్లో ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌న దేశంలో వాక్సిన్ ప్రయోగాలు మూడో ద‌శ‌కు చేరుకోబోతున్నాయి. దీంతో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా వాక్సిన్ వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే వాక్సిన్ వ‌చ్చిన వెంట‌నే ఎవ‌రికి ఇస్తారనే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.



ప్రపంచ‌ దేశాల‌ను క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ ఒక్కటే విరుగుడు కావడంతో.,. వాక్సిన్ క‌నుక్కునే ప‌నిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. భార‌త్‌లోనూ టీకా ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సంవ‌త్సం చివరికి వాక్సిన్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. టీకా వ‌చ్చిన త‌రువాత ముందుగా ఫ్రంట్ లైన్ వ‌ర్కర్స్‌కి ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో తెలంగాణ సర్కార్‌ ఉన్నట్టు స‌మాచారం.



అయితే దేశ వ్యాప్తంగా దాదాపుగా 25 కోట్ల మందికి ముందుగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే జ‌నాభాలో దాదాపుగా 18 శాతం మందికి టీకా ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక‌లు సిద్ధం చేస్తోంది.



వాక్సిన్ అందరికీ మొదటి విడత టీకాలు వేసే అవకాశం లేదు.. కాబట్టి ప్రాధాన్యత ప్రకారం టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా తమ ప్రాధాన్యతను తెలపాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఫార్మాట్‌ను రాష్ట్రానికి పంపించినట్లు వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన రంగాల పేర్లను పంపించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.



కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో దాదాపు 70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ మొదటి విడతలో ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ముందుగా క‌రోనాపై ప్రత్యక్ష యుద్ధం చేస్తూ.. ఫ్రంట్ లైన్‌లో అహర్షిషలు కృషి చేస్తున్న డాక్టర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బందికి మొద‌టి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. ఆ త‌రువాత గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ప‌ని చేసే ఆరోగ్య కార్యకర్తల‌కు ఇవ్వాల‌ని అనుకుంటున్నారు.



వీరి త‌రువాత ఉపాధ్యాయులకు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్టు స‌మాచారం. ప్రతిరోజు వంద‌లాది మంది విద్యార్ధుల‌కు పాఠాలు చెప్పేందుకు ఇంట‌రాక్ట్ అవుతారు కాబ‌ట్టి.. టీచర్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉంది తెలంగాణ ప్రభుత్వం.



ఇక త‌రువాత క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు.. ఎక్కువ‌గా స‌మూహాలుగా ప‌నిచేసే వివిధ రంగాల‌ను ఎంచుకోవాల‌నే ఆలోచ‌న‌లో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వ‌చ్చే ఏడాది ఆరంభం నుంచి క‌రోనా వాక్సినేష‌న్ మొద‌ల‌య్యే సూచ‌న‌లు క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి.