బతికుండగానే చనిపోయాడని చెప్పిన కార్పోరేట్ ఆస్పత్రి

బతికుండగానే చనిపోయాడని చెప్పిన కార్పోరేట్ ఆస్పత్రి

ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్న భార్యా పిల్లలకు రోగి లో కదలికలు కనిపించాయి. ఇదేంటని ఆస్పత్రి వర్గాలను నిలదీయటంతో డాక్టర్లు నీళ్లు నమిలారు.

జరిగింది ఏంటంటే…
పెద్ద అంబర్ పేటకు  చెందిన బీజేపీ సీనియర్‌నేత సి.నర్సింగరావు(67) శ్వాస సంబం ధిత సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం జూన్‌ 27న సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిది. ఆయన్ను నాలుగు రోజుల పాటు ఐసీయూలో ఉంచి  చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసోలేషన్‌ వార్డుకు మార్చారు.

ఆ తర్వాత శ్వాస తీసుకోవడం లో  మళ్లీ ఇబ్బంది  ఏర్పడటంతో ఆయన్ను తిరిగి ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌ ద్వార కృత్రిమశ్వాస అందిస్తున్నారు. జులై 8వ తేదీ  బుధవారంరాత్రి నర్సింగరావు కన్నుమూశారని…. వచ్చి శవాన్ని తీసుకెళ్లాల్సిం దిగా ఆస్పత్రి  సిబ్బంది  కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. కోవిడ్‌ మృతదేహాన్ని ఇంటికెలా  ఇస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, సారీ… ప్యాక్‌ చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తామని సమాధానం చెప్పారు.

చివరి చూపు కోసం వస్తే..
గురువారం ఉదయం కుటుంబ సభ్యులు అందరూ  చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వస్తోందని చెప్పి బిల్లులు  వసూలు చేసుకుని, సంతకాలు తీసుకున్నారు ఆస్పత్రి సిబ్బంది.  కాగా…. నరిసింగరావు చనిపోలేదని, ఆరోగ్యం మెరుగవుతోందని , అదే ఆస్పత్రిలోని మరో వైద్యుడి ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

వెంటనే వారు   ఐసీయూలో ఉన్న నరిసింగరావును వీడియో కాల్ లో సంప్రదించారు. నరసింగరావు రెస్పాండ్ అయి తాను బాగానే ఉన్నానని తల ఊపుతూ సంకేతం ఇచ్చారు.  దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీశారు.  తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ లోగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు నరసింగరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.

కార్పోరేట్ ఆస్పత్రి మోసం..
ప్రభుత్వ ఆస్పత్రిలో నమ్మకం లేకే కార్పోరేట్ ఆస్పత్రికి తీసుకువచ్చామని, రూ.4 వేల  ఇంజక్షన్ కు రూ.40 వేలు వసూలు చేశారని బాధితుడి కోడలు సోనియా ఆరోపించారు.రూ,8 లక్షలు బిల్లువేశారని ఇప్పటికే రూ.6లక్షలు చెల్లించామని చెప్పారు. ఇదేదో గొప్ప ఆస్పత్రి అంటారని…ఇంత చెత్త ఆస్పత్రి అనుకోలేదని…ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.