Killer Couple Arrest : బంగారం, డబ్బుల కోసం వరుస హత్యలు.. ఈజీ మనీ కోసం కిల్లర్ కపుల్ పైశాచిక ఆకృత్యాలు

హైదరాబాద్ లోని దుండిగల్ లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Killer Couple Arrest : బంగారం, డబ్బుల కోసం వరుస హత్యలు.. ఈజీ మనీ కోసం కిల్లర్ కపుల్ పైశాచిక ఆకృత్యాలు

Serial Murders

killer Couple arrest : హైదరాబాద్ లోని దుండిగల్ లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి అడువుల్లోకి తీసుకెళ్లి వారిని హత్య చేస్తున్న ఉదంతం బయటకొచ్చింది. ఓ కేసు తీగ లాగితే పైశాచిక దంపతుల ఆకృత్యాలన్నీ బయటకొస్తున్నాయి. కురువస్వామి అలియాస్ రవి, నర్సమ్మ ఇద్దరూ తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నర్సమ్మ ఇద్దరు పిల్లలు కూడా వారితోనే ఉంటున్నారు. ఇద్దరూ వికారాబాద్ జిల్లాకు చెందిన వారే కాగా కూలీ పనుల దగ్గర కలిసి సహజీవనం చేస్తున్నారు.

ఇద్దరూ మద్యానికి బానిసలై క్రూరంగా మారుతున్నారు. ఈజీ మనీ కోసం పైశాచికంగా తయారయ్యారు. మహిళల ఒంటి మీద బంగారం, వెండి ఆభరణాల కోసం హత్యలకు పాల్పడుతున్నారు. స్వామి గతంలో డ్రైవర్ గా, కూలీగా కూడా పని చేశాడు. అతనికి దుండిగల్ సమీపంలోని కూలీల అడ్డాలన్నీ తెలుసు. ఇదే అదనుగా అడ్డాలకు దగ్గరకు వెళ్లి కూలీలను టార్గెట్ చేయడం, వారికి కూలీ ఇప్పిస్తాని మాయ మాటలు చెప్పడం, నిర్మానుశ్య ప్రాంతాలకు తీసుకెళ్లి చోరీ చేయడం ఈ జంటకు అలవాటు అయిపోయింది.
స్వామి వెంట నర్సమ్మ కూడా ఉండటంతో బాధిత మహిళలకు అనుమానం కూడా వచ్చేది కాదు. ఇలా ఈనెలలోనే నాలుగు చోరీలు చేసింది ఈ జంట. ఇందులో భూమి అనే బాధితురాలిపై మనసు పడ్డ స్వామి మానభంగం చేసేందుకు ప్రయత్నించి, అమె ప్రతిఘటించడంతో అత్యంత కిరాతకంగా హత మార్చారు. ఇందుకు నర్సమ్మ కూడా సహకరించింది.

కూలీ కోసం వేచి చూస్తున్న భూమిని చూసి లైంగికంగా అనుభవించాలని స్వామి భావించాడు. నర్సమ్మతో కలిసి ఆమెకు మాయ మాటలు చెప్పాడు. సమీపంలో ఉన్న గుట్టపై ఉన్న ఆలయానికి సున్నం వేసే పని ఉందని చెప్పి జిన్నారంలోని నిర్మానుశ్య ప్రాంతమైన అగ్గిరాల గుట్టకు తీసుకెళ్లారు. ఆ గుట్టపైకి వెళ్లిన తర్వాత నర్సమ్మ భూమి కాళ్లు, చేతులు పట్టుకుంది. స్వామి అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే భూమి తీవ్రంగా ప్రతిఘటించడంతో సమీపంలోని కర్రను జననాంగంలోకి చొప్పించి రాక్షసంగా ప్రవర్తించాడు. నర్సమ్మ కూడా కర్రతో బాదడంతో భూమి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఒంటిపై ఉన్న చెవి పోగులు, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే నిర్మానుశ్య ప్రాంతం కావడం, గుట్టపైన హత్య జరగడంతో ఎవరికి తెలియలేదు. ఈ జంట అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

పోలీసులు తమ స్టైల్ లో ప్రశ్నించే సరికి తమ భాగోతం మొత్తం బయటపెట్టింది కిల్లర్ కపుల్. జులై మొదటి నుంచి ఇప్పటివరకు నాలుగు కేసులు చేసినట్లు ఒప్పుకుంది. ఇందులో భూమిని మాత్రం అత్యాచారం చేయగా మిగతా ముగ్గురిని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి నగులు దోచుకెళ్లారు. అయితే వీరిని మరింతగా విచారించాల్సిన అవసరముందని పోలీసులు చెబుతున్నారు. వీరు మరిన్ని కేసుల్లో నిందితులై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నగర శివార్లలో ఇటీవల జరిగిన ఒంటరి మహిళల హత్యలకు వీరికి సంబంధం ఉందని భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ కూడా జరుపుతున్నారు.

కూలీలనే కాకుండా కల్లు కాంపౌడ్ లో ఉండే మహిళలను కూడా వీరు టార్గెట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న మహిళలతో మాటలు కలిపి వారిని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం, చోరీ చేసినట్లుగా నిర్ధారించారు. వీరిని విచారిస్తే మరిన్ని వీరి ఇన్వాల్వ్ మెంట్ గురించి బయట పడే అవకాశం ఉంది. వీరికి పైశాచికత్వం వెలుగులోకి రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.