కిడ్నాప్.. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం కొత్త దారి పడుతున్నారు

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 11:25 AM IST
కిడ్నాప్.. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం కొత్త దారి పడుతున్నారు

kidnap: సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరస్తులు కొత్త దారి ఎంచుకున్నారు. గత కొంతకాలంగా దాన్ని ఫాలో అవుతున్నారు. అదే కిడ్నాప్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కిడ్నాప్ లు, మర్డర్ లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని తమ ప్రణాళిక అమలు చేస్తున్నారు. బాధితుల్లో కొందరు కిడ్నాపర్లు డిమాండ్‌ చేసిన డబ్బును ఇస్తుండగా.. మరికొందరు ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. కాగా, కిడ్నాపర్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. కిడ్నాప్ చేసి ప్రాణాలు తీస్తున్నారు.

ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్య ఘటన విషాదాంతమైంది. ఇంట్లో అద్దెకు ఉంటే యువకుడే చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పడేయడం కలకలం రేపింది. ఆ తర్వాత డెడ్ బాడీని అడ్డం పెట్టుకుని డబ్బు డిమాండ్ చేశాడు. మీ పిల్లాడిని వదిలి పెట్టాలంటే డబ్బు కావాలని అడిగాడు. తీరా చిన్నారి ఇక లేడు అనే వార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

నాలుగేళ్ల క్రితం.. షాహినాయత్‌ గంజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న పదో తరగతి విద్యార్థి అభయ్‌ మొదానిని నాలుగేళ్ల క్రితం అతడి ఇంట్లో పనిచేసే ముగ్గురు యువకులు శేషుకుమార్‌, రవి, మోహన్‌లు కిడ్నాప్ చేశారు. రూ.10 కోట్లు ఇస్తే వదిలేస్తామన్నారు. రూ.5 కోట్లు ఇచ్చేందుకు అభయ్‌ తండ్రి అంగీకరించాడు. అయితే బాలుడిని అట్టపెట్టెలో దాచి నోటికి, ముక్కుకి ప్లాస్టర్లు అతికించారు. దీంతో శ్వాస అందక అభయ్‌ చనిపోయాడు. మృతదేహాన్ని ఓ ట్రాలీలో తీసుకెళ్లి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రోడ్డుపై వదిలేశారు కిడ్నాపర్లు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనను ఇప్పటికీ నగరవాసులు మరిచిపోలేరు.

2019 జులై 30: సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలు, అమ్మకాలు నిర్వహిస్తున్న గజేందర్‌ పారేఖ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఏవీ కళాశాల సమీపంలోని ఆయన దుకాణం దగ్గర కిడ్నాప్ చేశారు. రూ.కోటి ఇస్తే వదిలేస్తామంటూ ఫోన్లు చేశారు. వారి కుటుంబ సభ్యులు రూ.30లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బు తీసుకుని గజేందర్‌ను వదిలేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

2020 ఫిబ్రవరి 2: జూబ్లీహిల్స్‌లో ఉంటున్న చేపల వ్యాపారి రమేష్‌(55)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్‌ ఫోన్‌ చేసి రూ.90 లక్షలు ఇస్తే రమేష్‌ను వదిలేస్తామంటూ హెచ్చరించారు. బోరబండలోని ఓ ఇంట్లో రమేష్‌ను హత్య చేసి గోనెసంచిలో మృతదేహాన్ని ఉంచి కిడ్నాపర్లు పారిపోయారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

రీసెంట్ గా మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారి దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అందరిని ఆవేదనకు గురి చేసింది. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో మెకానిక్ మంద సాగర్ దారుణానికి ఒడిగట్టాడు. దీక్షిత్ ని కిడ్నాప్ చేసిన రోజే చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడాడు. దీక్షిత్ ని వదిలి పెట్టాలంటే రూ.45లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టెక్నాలజీ ద్వారా దొరక్కుండా పోలీసులకు నాలుగు రోజులు చుక్కులు చూపించాడు. చివరికి మంద సాగర్ దొరికిపోయాడు. జరిగిన ఘోరం తెలిసి దీక్షిత్ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతోనే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు మంద సాగర్ ఒప్పుకున్నాడు.