CT Scanతో కరోనా టెస్టు చేయించుకుంటున్నారా, ప్రాణాలకే ప్రమాదం అంటున్న నిపుణులు

  • Published By: naveen ,Published On : August 20, 2020 / 01:04 PM IST
CT Scanతో కరోనా టెస్టు చేయించుకుంటున్నారా, ప్రాణాలకే ప్రమాదం అంటున్న నిపుణులు

ఈ మధ్య కాలంలో తమకు కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి చాలామంది సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా(జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి) వెంటనే ఎవరికి వారు సొంతంగా ప్రైవేట్ ల్యాబ్స్ కి వెళ్లిపోయి సీటీ స్కాన్ చేయించుకుని రిజల్ట్ తెలుసుకుంటున్నారు. దీనికి కారణం వెంటనే రిజల్ట్ తెలుస్తుండటమే. దీంతో అంతా అటువైపు పరుగులు తీస్తున్నారు. అయితే సీటీ స్కాన్ వల్ల కరోనా తెలుస్తుందా? ఈ తరహా పరీక్ష ఎంతవరకు సురక్షితం? సీటీ స్కాన్ తో రిజల్ట్ పక్కాగా ఉంటుందా? అనే ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనే అనుమానాలు, సందేహాలు బుర్రని వేడెక్కిస్తున్నాయి. దీనిపై వైద్య నిపుణలు స్పందించారు. సీటీ స్కాన్ తో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.



సీటీ స్కానింగ్ ప్రైమరీ పరీక్ష కోసం చేసే టెస్ట్ కాదు:
సీటీ స్కానింగ్ ప్రైమరీ పరీక్ష కోసం చేసే పరీక్ష కాదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ అన్నారు. జలుబు రాగానే వెంటనే వెళ్లి సీటీ స్కాన్ చేయించుకోవడం కరెక్ట్ కాదన్నారాయన. ఎందుకంటే, ఫస్ట్ టు, త్రీ డేస్ లో సీటీ స్కాన్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువ అని వివరించారు. ప్రాబ్లమ్ ఉన్నా సీటీ స్కాన్ రిపోర్టులో ఎలాంటి సమస్యా లేదని వస్తుందన్నారు.



సీటీ స్కాన్ టెస్టు ఎందుకు సేఫ్ కాదంటే:
”ఫస్ట్ టు, త్రీ డేస్ లో ఫాల్స్ నెగిటివ్ సీటీ స్కాన్స్ ఎక్కువగా ఉంటాయి. 50శాతం మందిలో మాత్రమే సీటీ స్కాన్ లో మార్పులు కనిపిస్తాయి. కరోనా నిర్ధారణ టెస్టుల్లో ముందుగా చేయించుకోవాల్సింది, ఉత్తమమైనది ఆర్టీ పీసీఆర్ టెస్టు. కరోనా గురించి ఏ మాత్రం అనుమానం ఉన్నా ముందుగా ఆ టెస్టే చేయించుకోవాలి. ఆర్టీ పీసీఆర్ చేయించుకోకుండా సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ప్రాణాలకు ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే సీటీ స్కాన్ లో కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఆర్టీ పీసీఆర్ లో నెగిటివ్ వస్తే, అలాంటి వారిని కరోనా కింద ట్రీట్ చేయాలా వద్దా అనే విషయం తెలియకుండా పోతుంది” అని డాక్టర్ ముఖర్జీ అన్నారు.



అసలు సీటీ స్కాన్ టెస్టు ఎప్పుడు చేయించుకోవాలి:
”ఆర్టీ పీసీఆర్ టెస్టులో రిజల్ట్ నెగిటివ్ వచ్చాక కూడా లక్షణాలు ఉంటే (ఆయాసం, దగ్గు) అప్పుడు సీటీ స్కాన్ టెస్టు చేయించుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా జలుబు చేయగానే ముందుగా వెళ్లి సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మరో ముఖ్యమైన విషయం సీటీ స్కాన్ లో ఉంది. అదే కోరైడ్స్. దీని ఆధారంగా ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని అనుకోవడం కరెక్ట్ కాదు. కోరైడ్స్ అనేది కేవలం డయాగ్నోసిస్ ఎంత కరెక్ట్ అని చెప్పడానికి మాత్రమే. కోరైడ్స్ 5 ఉందంటే దాదాపు కొవిడ్ ఉందని అర్థం. కానీ సివియర్ గా ఉందని కాదు. సీటీ సివియర్ కేసు స్కోర్ వేరే ఉంటుంది. దాని ఆధారంగా మనం తెలుసుకోవాలి. కోరైడ్స్ 6 అంటే కోరైడ్స్ 5 కన్నా ప్రమాదం అని కాదు. కోరైడ్స్ 6 అంటే, ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ ఉందని మాత్రమే అర్థం. కోరైడ్స్ 5 ఉందని తెలిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు లంగ్ ఇన్వాల్వ్ అయ్యింది అనే దాని బట్టే కంగారు పడాలి తప్ప కోరైడ్స్ 4 ఉంది, 5 ఉంది అనేది కాదు. కోరైడ్స్ 5 ఉంది అని వస్తే దాని అర్థం కచ్చితంగా కోవిడ్ అయ్యే చాన్స్ ఉందని” అని డాక్టర్ ముఖర్జీ విశ్లేషించారు.



”ఏది ఏమైనా ఆర్టీ పీసీఆర్ టెస్టు ద్వారానే కరోనా ఉందో లేదో కన్ ఫామ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆర్టీ పీసీఆర్ లో రిజల్ట్ నెగిటివ్ గా వచ్చినా సీటీ స్కాన్ లో ప్రాబ్లమ్ ఉంటే కొవిడ్ కింద ట్రీట్ చేయొచ్చు. అదే సమయంలో సివియర్ ప్రాబ్లమ్ ఉంటే ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా సీటీ స్కానింగ్ అనేది కరోనా స్క్రీనింగ్ టెస్టు కాదు. అనుమానం ఉన్న వారు, ముందుగా పోయి చేయించుకునే టెస్టు కాదనే విషయం అందరూ తెలుసుకోవాలి” అని డాక్టర్ ముఖర్జీ స్పష్టం చేశారు.