Cyber Crime: ఓయో రూమ్ కోసం ఫోన్ చేస్తే మూడు లక్షలు నొక్కేశారు!

ఇంటర్నెట్ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కస్టమర్ కేర్ నంబర్లు కాదని.. ఏదైనా అధికారిక వెబ్ సైట్ ద్వారానే సంప్రదించాలని పోలీసులు అవగాహనా కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెట్టి లక్షలు సమర్పించుకుంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

Cyber Crime: ఓయో రూమ్ కోసం ఫోన్ చేస్తే మూడు లక్షలు నొక్కేశారు!

Cyber Crime

Cyber Crime: కాదేదీ నేరగాళ్లకి అనర్హం అన్నట్లుగా సైబర్ నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఒక పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారని గ్రహించిన పోలీసులు ప్రజలకు అవగాహనా కలిగించే లోగా నేరగాళ్లు మరో పద్ధతిలో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. ప్రజలు కూడా పోలీసులు ఎన్ని చెప్పినా గుడ్డిగా వెళ్లి మోసగాళ్ల చేతికి చిక్కుతున్నారు. ఇంటర్నెట్ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కస్టమర్ కేర్ నంబర్లు కాదని.. ఏదైనా అధికారిక వెబ్ సైట్ ద్వారానే సంప్రదించాలని పోలీసులు అవగాహనా కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెట్టి లక్షలు సమర్పించుకుంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నగరానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి కాగా ఇటీవల కరోనా బారిన పడ్డాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు. చికిత్స అనంతరం అతడికి నెగిటివ్ రిపోర్టు వచ్చినా అతడి ఇంట్లో పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉండడంతో రిస్క్ చేయడం ఎందుకు మరికొన్ని రోజులు ఏదైనా హోటల్ లో ఉండడం మంచిదని భావించాడు. దీంతో ఆన్ లైన్లో ఓయో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి ఒక నెంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాల్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తి చెప్పినట్లుగా రమేష్ గుడ్డిగా చేసి మూడు లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు.

అసలు ఇంతకీ ఈ మోసం ఎలా జరిగిందంటే.. సైబర్ నేరగాళ్లు రమేష్ తో మాటలు కలిపి తన ఫోన్ లో క్విక్ సపోర్ట్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేయించి ఆ ఫోన్ యాక్సెస్ లాగేసుకున్నారు. ఆ తర్వాత రూమ్ బుకింగ్ కోసం అడ్వాన్సుగా ఓ వంద రూపాయలు పంపాలని ఓ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో రమేష్ పేమెంట్స్ యాప్ లో వాళ్ళు చెప్పినట్లుగా వంద రూపాయలు పంపాడు. అదంతా మానిటరింగ్ చేసిన నేరగాళ్లు రమేష్ అకౌంట్ లో ఉన్న మూడు లక్షల ఎనిమిది వేలు నగదుండగా మొత్తం ఖాళీ చేశారు. తీరా డబ్బులు పోయాక లబోదిబోమన్న రమేష్ పోలీసులు ఫిర్యాదు చేశారు.