సైబర్ కిలాడీలు : ఆదిలాబాద్‌లో ఆరోగ్యశ్రీ పేరిట రూ. 81 వేలు కొట్టేశారు

సైబర్ కిలాడీలు : ఆదిలాబాద్‌లో ఆరోగ్యశ్రీ పేరిట రూ. 81 వేలు కొట్టేశారు

cyber criminals Adilabad District : మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు. అమాయకులకు మాయమాటలు చెప్పి బుట్టలో పడవేస్తారు సైబర్ కిలాడీలు. ఇన్నాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీ అంటూ, లాటరీలంటూ ఫోన్లు చేసిన ఈ మాయగాళ్లు ఇప్పుడు రూట్‌ మార్చారు. ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త దందా స్టార్ట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫోన్ చేస్తున్నారు. మీకు ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని..అకౌంట్‌ వివరాలు చెప్పాలంటూ అమాయకులతో ఆడుకుంటున్నారు.

పోలీసులు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా.. ఎంతో మంది అమాయకులు సైబర్‌ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన చూస్తే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో స్పష్టమవుతుంది. వర్తమన్నూరు గ్రామానికి చెందిన ఆరెల్లి శంకర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యాడు. కొన్ని రోజులకి ఆరోగ్యశ్రీ నుంచి ఫోన్ చేస్తున్నామని ఫోన్‌ కాల్‌ వచ్చింది.

మీకు ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని బాధితుడి అకౌంట్ వివరాలు అడిగారు. ఏ మాత్రం ఆలోచించకుండా శంకర్‌ తన అకౌంట్ వివరాలు చెప్పాడు. కాసేపటి తర్వాత తన అకౌంట్‌లో 81 వేల రూపాయలు మాయమైనట్లు గుర్తించాడు. తాను మోసపోయినట్లు తెలుసుకొని కన్నీరుమున్నీరయ్యాడు. పోయిన డబ్బును ఎలా తెచ్చుకోవాలో తెలియక బాధితుడు శంకర్‌ 10TVని ఆశ్రయించాడు. దీంతో 10 టీవీ ఈ విషయాన్ని సంబంధిత బ్యాంక్‌ దృష్టికి తీసుకెళ్లింది. 10టీవీ ఇచ్చిన కంప్లైంట్‌కు బ్యాంక్‌ సానుకులంగా స్పందించింది. బాధితుడికు న్యాయం చేస్తామని హామి ఇచ్చింది.