Cyber Fraud : లింక్ క్లిక్ చేశాడు, రూ.6.5లక్షలు పొగొట్టుకున్నాడు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.

Cyber Fraud : లింక్ క్లిక్ చేశాడు, రూ.6.5లక్షలు పొగొట్టుకున్నాడు

Cyber Fraud

Cyber Fraud : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు. కాంటాక్ట్ నెంబర్ల కోసం గూగుల్ మీద ఆధారపడొద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు. అయినా ఇంకా చాలామంది గూగుల్ నే నమ్ముకుని దగా పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి గూగుల్ లో చూసి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కాల్ చేశాడు. కట్ చేస్తే.. అతడి అకౌంట్ నుంచి రూ.6.5లక్షలు మాయం అయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ ఆయుర్వేద ఉత్పత్తులను రిటర్న్‌ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కి రూ.6.5లక్షలకు పైగా మోసపోయాడు. హైదరాబాద్ లోతుకుంటకు చెందిన పశుపతి ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా ఓ సంస్థకు చెందిన పలు ఆయుర్వేద ఉత్పత్తులను కొన్నాడు. అయితే అవి నచ్చకపోవడంతో వాపసు చేయాలని నిర్ణయించాడు. గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం వెతికాడు. ఓ నెంబర్ కనిపించింది. దానికి కాల్ చేశాడు. మరో నెంబర్ నుంచి కాల్ చేస్తామని అవతలి వ్యక్తి చెప్పాడు. కాసేపటికి మరో వ్యక్తి ఫోన్‌ చేసి తాను ఆ సంస్థ నుంచి కాల్‌ చేస్తున్నానని, మీ కొనుగోళ్లు వాపసు తీసుకుంటామని నమ్మబలికాడు. డబ్బులు తిరిగి మీ బ్యాంక్‌ ఖాతాకు క్రెడిట్‌ చేస్తామని కబుర్లు చెప్పాడు, మీ మొబైల్‌కు వచ్చే లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని సూచించాడు.

ఇదంతా నిజమే అని నమ్మిన పశుపతి.. అతడు చెప్పినట్లే లింక్‌ క్లిక్‌ చేయగా ఎనీడెస్క్‌ యాప్‌ ఓపెన్‌ అయ్యింది. అది డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత మరోసారి కాల్‌ చేసిన ఆగంతకుడు మీరు ఫోన్‌ను ఓపెన్‌లో ఉంచాలని, లాక్‌ చేయవద్దని చెప్పి పశుపతికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుల నెంబర్లు, సీవీవీ నెంబర్లు తీసుకున్నాడు.

కాసేపట్లో మీ డబ్బు కార్డులకు జమ అవుతుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆ తర్వాత రూ.3లక్షలు క్రెడిట్‌ కార్డు నుంచి, రూ.3.59లక్షలు డెబిట్‌ కార్డు నుంచి డెబిట్‌ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో పశుపతికి దిమ్మతిరిగింది. తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్లకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో బాధితుడు సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.