పోలీసుల సాయంతో.. యువతిగా మారిన యువకుడు

పోలీసుల సాయంతో.. యువతిగా మారిన యువకుడు

Cyberabad Cops Helps To A Man To Convert As Transgender1

యువతిగా మారాలన్న ఓ యువకుడి కోరికను తల్లిదండ్రులు కొట్టిపారేశారు. అటువంటి ఆలోచన కూడా చెయ్యొద్దని మందలించారు. ఈ విషయమై తల్లిదండ్రులతో గొడవ జరిగి నాలుగు సార్లు ఇంట్లోంచి పారిపోయాడు. కొడుకు కనిపించని ప్రతి సారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చేవారు. మూడు సార్లు పోలీసులు యువకుడిని గుర్తించి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నాలుగోసారి తన కోరికను నెరవేర్చారు.

ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తల్లిదండ్రులు తన కోరికను కాదనడంతో ఇంట్లోంచి పారిపోయి ఎల్బీ నగర్ లో ట్రాన్స్ జెండర్స్ గ్రూప్‌లో చేరారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువకుడిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తర్వాత రెండు సార్లు పారిపోయాడు.

చివరిగా నాలుగోసారి సిద్ధిపేటకు పారిపోగా.. తల్లిదండ్రులు షాద్ నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో
వారు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్‌ హెల్ప్‌ డెస్క్‌కు పంపారు. సబ్-ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో సాగుతున్న ఈ డెస్క్‌ వీరి నుంచి ఫిర్యాదు స్వీకరించింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించింది. సిద్దిపేటలో ఉన్న యువకుడిని హైదరాబాద్ తీసుకొచ్చారు.

యువతిగా మారాలన్న తన కోరిక తీరకపోతే భవిష్యత్ లో ఇటువంటివి మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకును కూతురుగా మార్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో యువకుడికి సర్జరీ చేసి యువతిగా మార్చారు. అనంతరం పోలీసులు ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడనంటూ యువతిగా మారిన యువకుడి నుంచి హామీ తీసుకుని పంపారు.

ట్రాన్స్‌జెండర్స్‌ అంశాలకు సంబంధించి సహాయ సహకారాలు కావాల్సిన వారు 94906 17121లో వాట్సాప్‌ ద్వారా (transgender.cybsuprt121@gmail.com) ఇన్‌స్టాగ్రామ్‌ (transgender cybsupport), ఫేస్‌బుక్‌ ‘Transgender Cyberabad Support) ఖాతాల్లో సంప్రదించాలని సైబరాబాద్‌ పోలీసులు సూచించారు.