అలా చేస్తే క్రిమినల్ కేసులు.. హైదరాబాద్ వాహనదారులకు, మెకానిక్‌లకు పోలీసుల వార్నింగ్

10TV Telugu News

cyberabad cp warns vehicle owners: హైదరాబాద్ లో వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామన్నారు. పద్ధతిగా నడుచుకోకపోతే చిప్పకూడు తినిపిస్తామన్నారు. అయితే ఈ వార్నింగ్ అందరికీ కాదులెండి. సైలెన్సర్లను మార్చి న్యూసెన్స్ క్రియేట్ చేసే వారికి మాత్రమే. వింత శబ్దాలతో, విపరీతమైన శబ్ద కాలుష్యంతో రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనదారులపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీరియస్ అయ్యారు. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ మధ్య కొందరు వాహనదారులు, ఆకతాయిలకు పైత్యం బాగా ఎక్కువైంది. పిచ్చి ముదిరి ఓవరాక్షన్ చేస్తున్నారు. స్టైల్, వెరైటీ, ఫ్యాషన్ పేర్లతో తమ కార్లు, బైక్‌లకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్చేస్తున్నారు. వాటి స్థానంలో వింతగా, భారీగా శబ్దాలొచ్చే కొత్త రకం సైలెన్సర్లను బిగిస్తున్నారు. ఆ సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వాటి వల్ల తోటి వాహనదారులు, స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. బాగా డిస్ట్రబ్ అవుతున్నారు. రోడ్డు మీద వెళ్లే సమయంలో సడెన్ గా వెనుక నుంచి పెద్ద శబ్దం రావడంతో కంగారుపడిపోతున్నారు. కొన్ని సయయాల్లో కంట్రోల్ తప్పి కిందపడిపోతున్నారు. అలాంటి పరిస్థితులను కల్పించే వాహనదారులపై ఉక్కుపాదం మోపనున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు.

కాగా, ఇలాంటి సైలెన్సర్లు బిగించేందుకు అధిక మొత్తంలో డబ్బులు వస్తుండటంతో కొందరు మెకానిక్‌లు ఇలాంటి భయంకరమైన సౌండ్స్‌ వచ్చే సైలెన్సర్‌లు బిగిస్తున్నారు. ఆ తరహా సైలెన్సర్లను అమరుస్తున్న మెకానిక్‌లకు కూడా సీపీ వార్నింగ్ ఇచ్చారు. వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘సైలెన్సర్లు వాడేది కాలుష్యం తగ్గించడానికే.. శబ్ద కాలుష్యం చేయడానికి కాదు’’ అని సోషల్‌ మీడియాలో ఓ వీడియో అప్‌లోడ్‌ చేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు సీపీ సజ్జనార్.

×