ముంచుకొస్తున్న మహా తుఫాన్: తెలంగాణలోనూ భారీ వర్షం

ముంచుకొస్తున్న మహా తుఫాన్: తెలంగాణలోనూ భారీ వర్షం

మహా తుఫాన్ తీవ్రత తగ్గడం లేదు. ఈ ధాటికి రానున్న 48గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్‌ వాయవ్య దిశగా పయనిస్తుంది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయం కల్లా గుజరాత్‌ పోర్‌బందర్‌ తీరానికి పశ్చిమనైరుతి దిశగా 660 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. 

మయన్మార్‌ తీరప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉత్తర అండమాన్‌ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇంకో 12 గంటల్లో తీవ్రఅల్పపీడనంగా మారి, మరో 48 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్‌లోని వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రత 2.2 డిగ్రీలు పెరిగి 33.2 డిగ్రీల సెల్సియస్‌‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 5.2 డిగ్రీలు పెరిగి 22.2 సెల్సియస్‌ డిగ్రీలుగా నమైదైంది. గాలిలో తేమ స్థాయి 52 శాతంగా నమోదైందని తెలిపారు. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో మరో 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.