ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలకు అడ్డుతగిలిన కూతుళ్లు

ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలకు అడ్డుతగిలిన కూతుళ్లు

funeral for the property : ఆస్తి కోసం మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో రోజుకొక ఉదాహరణ బయటపడుతోంది. ఆస్తి కోసం ఇద్దరు కూతుర్లు విచక్షణ కోల్పోయారు. తమ బాధ్యతను మరిచిపోయారు. తండ్రి చనిపోయాడన్న బాధ ఏ మాత్రం లేకుండా ప్రవర్తించారు. ఏకంగా దహన సంస్కారాలనే అడ్డుకున్నారు. మానవత్వానికే మాయని మచ్చగా మిగిల్చిన ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్తి కోసం దహన సంస్కారాలను అడ్డుకున్న కుమారులను చూసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఇద్దరు కూతుళ్లు ఆస్తి కోసం ఇలాంటి పని చేయడం చాలా అరుదు.

ఈ ప్రపంచంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం చాలా ప్రత్యేకం. ప్రతీ అమ్మాయికి మొదటి హీరో నాన్నే. తల్లి బిడ్డను తొమ్మిది నెలలే కడుపులో దాచుకుంటుంది. కానీ తండ్రి ఊపిరున్నంత కాలం కూతురికి ఏ కష్టమొచ్చినా గుండెలో పెట్టుకుని కాపాడుతాడు. కనురెప్పల చాటున కన్నీరును దాచి కూతురుకు నవ్వుతూ కనిపిస్తాడు. అందరి తండ్రుల్లాగే పాలకుర్తికు చెందిన చంద్రయ్య కూడా. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. ఐదేళ్ల క్రితం చంద్రయ్య భార్య మరణించింది. ఆయన ఒంటరివాడయ్యాడు. ముగ్గురి బిడ్డల్లో తన అమ్మను చూసుకుంటూ పెంచి పెద్ద చేసిన ఆయనకు నీడ కావాల్సిన సమయంలో అందరూ మొహం చాటేశారు.

భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న నాన్నను చూసిన చివరి కూతురు మనసు కొన్నాళ్లకు కరిగింది. ఆస్తి కోసం కరిగిందో నాన్నపై సడన్‌గా ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియదు కానీ..తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంది. నీడలా తోడుంది. తండ్రి వెన్నంటే నిలిచింది. కోరింది తెచ్చి ఇచ్చింది. ఈ ఐదేళ్లలో అన్నీ తానై చూసుకుంది. మిగిలిన ఇద్దరూ అప్పడప్పుడు వచ్చి వెళ్తుండేవారు. చివరి కూతురి మీద ప్రేమతోనో లేక వృద్ధాప్యంలో తోడుగా నిలిచిందనో కానీ.. తండ్రి తన పేరు మీదున్న ఇంటిని మూడో కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆ తర్వాత కొనాళ్లకు చనిపోయాడు. చంద్రయ్య మరణించడంతో మృతదేహాన్ని తన సొంత ఇంటికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది మూడో కుమార్తె. తండ్రి చనిపోయాడన్న బాధ లేకుండా అక్కడికి గొడవకు వచ్చారు మొదటి ఇద్దరి కూతుళ్లు. ఆస్తుల పంపకాలపై అగ్రిమెంట్

చేసుకున్న తర్వాతనే దహన సంస్కారాలు జరపాలని మొండికేశారు. చనిపోయిన సమయంలో ఇలాంటి గొడవలు వద్దని..అంత్యక్రియలు ముగిశాక సంతకాలు పెట్టుకుందామని ఊళ్లోవాళ్లు ఎంత చెప్పినా ఇద్దరు కూతుళ్లు కనికరించలేదు.
ఆస్తిపాస్తుల కోసం వ్యామోహం తప్ప కన్న తండ్రిపై ప్రేమ లేదని వాళ్లని చూస్తే అర్ధమయింది. దహన సంస్కారాలు చేయనివ్వకుండా బేరసారాలు ఆడుతూ సంస్కారం లేని వారిలా ప్రవర్తించారు. మృతదేహాన్ని కదలనివ్వలేదు. తండ్రి మరణించిన బాధ ఏమాత్రం లేకుండా, ఆస్తి కోసం కూతుళ్లు కొట్లాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకి అర్థం లేదని ప్రూవ్‌ అయింది. ఇక విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్, ఎస్ఐ సీన్‌లోకి దిగి రెండువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వినక పోవడంతో గ్రామపంచాయితీ ఆద్వర్యంలో అంత్యక్రియలు జరుపుతామని హెచ్చరించారు. దీంతో కూతుళ్లు వెనక్కి తగ్గారు. దహన సంస్కారాలకు అడ్డుచెప్పకుండా ఆగడంతో చంద్రయ్య దహన సంస్కారాలు జరిగాయి.