హైదరాబాద్ షేక్‌పేట చేరుకున్న అరకు ప్రమాద మృతదేహాలు..ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాలుడు

హైదరాబాద్ షేక్‌పేట చేరుకున్న అరకు ప్రమాద మృతదేహాలు..ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాలుడు

dead bodies reached to Hyderabad : విశాఖ జిల్లా అరకు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్సుల్లో నాలుగు మృతదేహాల్ని హైదరాబాద్‌లోని షేట్‌పేటకు తీసుకొచ్చారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు కన్నీరుమున్నీరవుతున్నాయి. అక్కడ ఎవరిని కదిలించినా.. ఎటు చూసినా కన్నీటి సంద్రమే కనిపిస్తోంది.

అరకు ప్రమాదంలో సత్యనారాయణ, లత, సరిత, శ్రీనిత్య మృతి చెందారు. విహార యాత్రకు వెళ్లిన వారిలో నలుగురు విగతజీవులుగా రావడంతో… కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో బంధువులు సత్యనారాయణ ఇంటి దగ్గర చేరుకున్నారు. మృతుల నివాసం వద్ద విషాద వాతావరణం నెలకొంది.

ఆరకులో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ బాలుడు ఏం జరిగందో ఆర్థంకానీ పరిస్థతిలో ఉన్నాడు. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో బస్సు లోయలో పడిపోయిందంటున్నాడు బాలుడు. కాపాడమని కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న స్థానికులు.. తమను ఆస్పత్రికి తరలించారని తెలిపాడు. తన తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాలని.. తనకు చాలా భయం వేసిందంటూ అమాయకంగా చెప్పడం కలచివేస్తోంది.

విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్‌ రోడ్డులో శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డముకు దగ్గర పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్‌ మలుపు దగ్గర లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందినవారు.

హైదరాబాద్‌లోని షేక్‌ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10న దినేష్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు (టీఎస్‌09-యూబీ 3729)లో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. గురువారం విశాఖ నగరంలోని వివిధ సందర్శనా ప్రాంతాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా సింహాచలం బయలుదేరారు.

అప్పటివరకు సరదాగా సాగిన ఈ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 200 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది.

లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలకు ఉపక్రమించారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధృవీకరించారు.