గొర్రెకుంట 9 హత్యల కేసులో సంచలన తీర్పు, సంజయ్‌కు ఉరిశిక్ష

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 03:08 PM IST
గొర్రెకుంట 9 హత్యల కేసులో సంచలన తీర్పు, సంజయ్‌కు ఉరిశిక్ష

Death Sentence To Accused Sanjay: తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గొర్రెకుంట 9మంది హత్య కేసులో తుదితీర్పు వెల్ల‌డైంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24)ను దోషిగా తేల్చిన వరంగల్ సెషన్స్ కోర్టు.. సంజయ్ కు ఉరిశిక్ష ఖరారు చేసింది. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ 2020 మే 21న తొమ్మిది మందిని వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు. తాను నేరం చేసినట్లు సంజయ్ అంగీకరించాడు. నిందితుడిపై అభియోగాల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిరూపించారు. దీంతో సంజయ్ ను దోషిగా నిర్ధారించిన జడ్జి జయకుమార్ ఉరిశిక్ష ఖరారు చేశారు.

మే 21న గొర్రెకుంటలో 9మంది సామూహిక హత్యకు గురయ్యారు. మూడేళ్ల చిన్నారి సహా 9మందిని సంజయ్ కుమార్ అమానుషంగా చంపేశాడు. ఆహారంలో మత్తు మందు కలిపి బతికుండగానే 9మందిని బావిలో పడేశాడు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో మసూల్ ఆలం(50), ఆలం భార్య, ఆలం ఇద్దరు కుమారులు, ఆలం కూతరు, ఆలం మనవడు ఉన్నారు.

మసూద్ ఆలం బంధువైన మహిళతో సంజయ్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ మహిళను రైల్లో హత్య చేశాడు సంజయ్ కుమార్. ఆ హత్య విషయం బయటికి రాకుండా చేసేందుకు ఆలం కుటుంబంతో పాటు మొత్తం 9మందిని హత్య చేశాడు సంజయ్. సంజయ్ కుమార్ పై ఏడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు 5 నెలల్లోనే విచారణ పూర్తి చేయడం, కోర్టు శిక్ష ఖరారు చేయడం విశేషం.

ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 మందిని సంజయ్ కుమార్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. 25 రోజుల్లోనే ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. 57మంది వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు కేసు నుండి తప్పించుకోకుండా పోలీసులు పక్కాగా సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరిశిక్షను విధించింది.

ఈ కేసులో నిందితుడిగా సంజయ్ కుమార్ ను 72 గంటల్లో గుర్తించారు. నిందితుడు సంజయ్ కు ఉరిశిక్ష పడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ హత్యలు తానే చేసినట్టుగా జడ్జి ముందు సంజయ్ కుమార్ అంగీకరించాడు. ఈ కేసులో నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో నిరూపించారు. దీంతో నేరం రుజువైందని జిల్లా కోర్టు ప్రకటించింది. సంజయ్ ని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష ఖరారు చేసింది.