పోలీసులకు డిపోర్టేషన్ కష్టాలు : విదేశీ నేరస్తులను వెనక్కి పంపడం ఎలా

హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 05:46 AM IST
పోలీసులకు డిపోర్టేషన్ కష్టాలు : విదేశీ నేరస్తులను వెనక్కి పంపడం ఎలా

హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు

హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు పంపడం చాలా కష్టంగా మారింది. విదేశీ నేరస్తులను ఇక్కడ ఉంచలేక.. తిరిగి వారి దేశాలకు పంపలేక.. సతమతం అవుతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే. ఉగ్రవాదం… మాదకద్రవ్యాలు… సైబర్‌ నేరాలు… ఇలా వివిధ కేసుల్లో పలువురు విదేశీయులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. అలాగే సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని కూడా పట్టుకుంటున్నారు. వీరందరిని ఎప్పుడో ఒకప్పుడు వారి దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సి ఉంటుంది. దీన్నే డిపోర్టేషన్‌ అంటారు. అయితే ఈ ప్రక్రియ పోలీసులకు పెద్ద ప్రహసనంగా మారింది. 2018 లో సైబర్‌ నేరంలో చిక్కిన పాకిస్థానీ ఇక్రమ్‌ విషయంలో ఈ తంతు ఇంకా నడుస్తోంది. ఇది చాలదన్నట్టు.. తాజాగా మరో పాక్ దేశస్తుడు గుల్జార్ పట్టుబడ్డాడు. అతడి విషయంలో డిపోరే్టేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సాధారణ వ్యక్తుల అరెస్ట్ విషయంలో ఉండే నిబంధనలకు భిన్నంగా విదేశీయుల అరెస్ట్ లో ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు, ఆయా దేశాలతో ఉండే ట్రేడ్ రిలేషన్స్ ఆధారంగా ఈ విధానాలు ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం నగరంలో ఏ విదేశీయుడిని అరెస్ట్ చేసినా తక్షణం ఆ సమాచారం ఆ దేశాలకు చెందిన ఎంబసీ/కాన్సులేట్‌ కార్యాలయానికి చేర్చాలి. నిందితులను అరెస్టు చేసిన విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా, అమల్లో ఉన్న ఫార్మాట్‌ల ప్రకారం దీన్ని అందిస్తారు. ఇతర దేశాల విషయంలో పరిస్థితి ఎలా ఉన్నా… అమెరికా, లండన్‌ తదితర కొన్నింటికి చెందిన రాయబార కార్యాలయాలు ఈ విషయాల్లో వెంటనే స్పందిస్తాయి. తమ ఉద్యోగులను జైళ్లకు పంపుతాయి. రిమాండ్‌లో ఉన్న తమ దేశీయులను కలిసి మాట్లాడేలా చేస్తాయి. అవసరమైతే న్యాయ సాయం చేయడానికి ముందుకు వస్తాయి. 

ఎంహెచ్‌ఏ, ఎంఈఏల ద్వారా పోలీసులు రాసే ప్రతి లేఖ పైనా ఆయా రాయబార కార్యాలయాలు సానుకూలంగా స్పందించవు. ఆ నిందితుడిపై మోపిన నేరాల తీరుతెన్నులను బట్టి వారి స్పందన ఉంటుంది. సైబర్‌ నేరాలు, మోసాలతో పాటు హత్య, హత్యాయత్నం, దాడి వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా దోషిగా నిరూపితమైన వ్యక్తి తమ దేశీయుడే అంటూ అంగీకరిస్తాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన ఇక్రమ్‌ విషయంలో అతడు పాకిస్థానీయే అని అంగీకరించిన ఆ దేశం.. కేసు విచారణ ముగిసిన వెంటనే డిపోర్టేషన్‌ చేయమని కోరింది. ఉగ్రవాదం, గూఢచర్యం వంటి ఆరోపణలు, బలమైన ఆధారాలు ఉన్న కేసుల్లో మాత్రం ఆయా దేశాలు ఈ విధంగా స్పందించవు. అరెస్టు అయిన వ్యక్తికి, తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంటాయి. కొన్నేళ్ళ క్రితం పాతబస్తీలో చిక్కిన ఐఎస్‌ఐ ఏజెంట్‌ సలీం జునైద్‌ విషయంలో ఇలానే జరిగింది. 

ఆయా దేశాలతో సంప్రదింపులు, రూఢీలు పూర్తయ్యే వరకు ఆయా నిందితులు ఇక్కడే ఉంటారు. కేసు విచారణలో ఉంటేనో, శిక్ష పడితేనో జైల్లో ఉంచాలి. అలా కాకుండా సరైన ఆధారాలు లేని కారణంగా కేసు వీగిపోయినా, శిక్షాకాలం పూర్తయినా డిపోర్టేషన్‌ సెంటర్‌కు తరలిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్‌ విశాఖపట్నంలో ఉండేది. ప్రసుత్తం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) డిపోర్టేషన్‌ సెంటర్‌గా, దాని డీసీపీ డిటైన్‌ చేసే అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో కొన్ని ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీరిలో కొందరు తమ వివరాలు చెప్పడానికి వెనుకాడటంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి వెళ్ళమని చెప్తున్నారు. అలాంటి వారిలో అర్హత ఉన్న వారికి డిపోర్టేషన్‌ సెంటర్‌ అధికారులే ఐక్యరాజ్య సమితి నుంచి శరణార్థుల కార్డులు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఏ నేరంలో చిక్కిన విదేశీయుడినైనా ఏదో ఒక సందర్భంలో వారి దేశానికి పంపించేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పంపాలనేది ఆ దేశ రాయబార కార్యాలయం కోరిన దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసు విచారణతో పాటు శిక్షాకాలం ముగిసిన తర్వాత, అరుదైన కేసుల్లో మాత్రమే శిక్షతో సంబంధం లేకుండా కేసు విచారణ ముగిసిన వెంటనే పంపాల్సి ఉంటుంది. డిపోర్టేషన్‌గా పిలిచే దీన్ని చేపట్టాలంటే తొలుత ఆ నిందితుడు/దోషి తమ దేశీయుడే అంటూ ఆ దేశం అంగీకరిస్తూ రాయబార కార్యాలయం ద్వారా సందేశం ఇవ్వాలి. దీనికోసం పోలీసు విభాగం నిందితుడి/దోషి వివరాలు, అందుబాటులో ఉంటే పాస్‌పోర్ట్‌ నెంబరుతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు (ఎంహెచ్‌ఏ) లేఖ రాస్తారు. ఆ శాఖ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దాన్ని ఆయా దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించి వివరాలు పొందుతుంది. దీనికి కొన్ని నెలల సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. 

హైదరాబాద్ లో ఏళ్లుగా వివిధ నేరాలకు సంబంధించి విదేశీయులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలా చిక్కుతున్న వారిలో అత్యధికులు ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళే ఉంటున్నారు. నైజీరియా, ఇథియోపియా, సోమాలియా, సూడాన్‌ తదితర దేశాలకు చెందిన అనేక మంది విద్య, ఉద్యోగ, వ్యాపార వీసాలపై వచ్చి దాని గడువు ముగిసినా అక్రమంగా స్థిరపడి చిక్కుతున్నారు. ఇలాంటి వారితో పాటు సక్రమంగా నివసిస్తున్న వారిలోనూ డ్రగ్స్, సైబర్‌ నేరాలకు పాల్పడుతూ మరికొందరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇక ఉగ్రవాద సంబంధ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశీయులు ఉంటున్నారు. ఇటీవల కాలంలో రోహింగ్యాల అరెస్టులూ పెరిగాయి. వీటితో పాటు ఇతర దేశాలకు చెందిన వారూ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు.

Also Read : మందుబాబులకు న్యూఇయర్ షాక్ : దొరికితే రూ.10వేలు ఫైన్.. వాహనం సీజ్