నేరుగా పంచాయితీల అకౌంట్లోకే నిధులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: vamsi ,Published On : September 25, 2020 / 08:31 AM IST
నేరుగా పంచాయితీల అకౌంట్లోకే నిధులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

అవినీతికి ఏ మాత్రం తావు లేకుండా ముందుకు సాగాలనే నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా.. అలాగే అధికారుల అలసత్వం కారణంగా కూడా పంచాయితీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతినెలా విడుదలచేస్తున్న నిధులను ఇకపై నేరుగా పంచాయతీల ఖాతాలోనే జమచేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు.




కరోనా పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా రూ.309 కోట్ల చొప్పున పంచాయితీలకు నిధులను విడుదల చేస్తుండగా.. మధ్యలో కొందరు అధికారులు అలసత్వం, అవినీతి మార్గాల కారణంగా అవి పంచాయతీలకు ఆలస్యంగా చేరుతున్నాయి. మెదక్‌ జిల్లా డీపీవో ఏప్రిల్‌ నెలలో ఇవ్వాల్సిన నిధులను ఎలాంటి ఇబ్బందులు, కారణాలు లేకుండానే ఆపేసి, ఆగస్టులో విడుదల చేశారు.



అయితే ఆ అధికారి నిర్లక్ష్యం కారణంగా పంచాయతీలు ఇబ్బందులు పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని డీటీవో (జిల్లా ట్రెజరీ అధికారులు), డీపీవో (జిల్లా పంచాయతీ అధికారులు)ల ప్రమేయం లేకుండానే నేరుగా పంచాయతీల ఖాతాల్లో నిధులు జమచేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. పారదర్శకంగా నిధులను పంచాయితీలకు చేరేలా చెయ్యడానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.