ధరణి పోర్టల్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆలస్యం!

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 11:19 PM IST
ధరణి పోర్టల్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆలస్యం!

Dharani Portal : ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు వివరించింది. ధరణిలో కులం వివరాలు సేకరించబోమంటూ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజిక వర్గం వివరాలను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. సేకరించిన వివరాలన్నీ రాష్ట్ర డేటా సెంటర్‌లో అత్యంత భద్రంగా ఉంటాయని కోర్టుకు వివరించింది.



వ్యవసాయేతర ఆస్తుల యజమానుల ఆధార్‌ వివరాల కోసం ఒత్తిడి చేయబోమని పేర్కొంది. సాగు భూముల యజమానుల ఆధార్‌ వివరాల సేకరణ తప్పేమి కాదని చెప్పిన ప్రభుత్వం… ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని హైకోర్టును కోరింది. దీంతో.. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.



మరోవైపు.. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈనెల 23 నుండి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.



రిజిస్ట్రేషన్ల పై స్టే కొనసాగుతోంది. ఈ విషయంపై ఈ నెల 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్లు మరో మూడు నాలుగు రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.