ధరణి పోర్టల్ : వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే

10TV Telugu News

Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసిన సీఎం కేసీఆర్.. ఈ పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.వచ్చే నెల 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. మోసాలకు ఆస్కారమే లేకుండా.. ప్రజల్లో గందరగోళం లేకుండా పక్కాగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేలా.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకూ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక ధరణి అందుబాటులోకి రావడంతో.. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పైరవీలు అవసరం ఉండదు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 141 ఉండేవి. వాటికి అదనంగా 570 ఎమ్మార్వో ఆఫీసులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చారు.https://10tv.in/cm-kcr-to-address-on-dharani-portal-2/
మ్యుటేషన్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడా సీన్ మారిపోయింది. ఎవరైనా భూమి అమ్మినప్పుడు, కొనేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎమ్మార్వో ఆఫీసుకు సమాచారం ఇవ్వాలి. చలాన ప్రకారం ఫీజు కట్టేయాలి. మ్యుటేషన్ ఫీజు కూడా ఉంటుంది. వాటిని చెల్లించిన తర్వాత.. కోరుకున్న స్లాట్ అలాట్‌ అవుతుంది. 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.ఎవరి పాస్ బుక్ వారికి ఇస్తారు. ఒకరి పాస్ బుక్‌లో డిలీట్, మరో పాస్ పుస్తకంలో ఎంట్రీ అవుతుంది. కొనే వ్యక్తికి పాస్ బుక్ లేకపోతే..సంబంధిత ఫీజు చెల్లిస్తే.. పాస్ బుక్ ఇచ్చేస్తారు. కరెక్టు అడ్రస్ ఇస్తే..నేరుగా ఇంటికే వస్తుంది. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
భూ రిజిస్ర్టేష‌న్ల విష‌యంలో పాత రిజిస్ర్టేష‌న్ ఛార్జీలే వ‌ర్తిస్తాయి. ప్రభుత్వం నిర్ణయించిన భూమి ధర ఎంత ఉందో..దాని ప్రకారమే..డబ్బులు కట్టాల్సి ఉంటుంది.రిజిస్ర్టేష‌న్ల కోసం పైర‌వీలు చేసే అవ‌స‌రం ఉండదు. మీ-సేవా, ధ‌ర‌ణి పోర్టల్‍‌లో వ్యక్తిగతంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ధ‌ర‌ణి పోర్టల్‌లో న‌మూనా ప‌త్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటి ఆధారంగా ఎవ‌రికి వారే రిజిస్ర్టేష‌న్ ప్రక్రియ పూర్తి చేసుకోవ‌చ్చు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, స్కానర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ల కోసం అనుభవం ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్స్‌లను సైతం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక సమస్యలు వస్తే.. సరిచేసేందుకు టెక్నికల్ టీంను రెడీ చేసింది.ధరణి పోర్టల్‌ భారత దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ధరణి పోర్టల్‌ రూపొందించామన్నారు. ధరణి అంతా పారదర్శకంగా ఉంటుందని… ఇందులో ఎలాంటి గోల్‌మాల్‌ వ్యవహారం ఉండబోదన్నారు. ఇక నుంచి అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగబోవని.. వాటికి చెక్ పడుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

10TV Telugu News