ధరణి పోర్టల్ ప్రారంభం, అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 01:10 PM IST
ధరణి పోర్టల్ ప్రారంభం, అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం

Dharani Portal Launch At Muduchintalapalli Village : తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ధరణి పోర్టల్ రెవెన్యూ సంస్కరణల్లో.. మైలురాయిగా నిలవనుంది. ఈ పోర్టల్‌ ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి.




సులభతరమైన సేవలు :-
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో వీటికి అంకురార్పణ జరుగుతోంది. దస్తావేజుల రాతకోతలు అవసరం లేని సులభతరమైన సేవలు మరే రాష్ట్రంలోనూ లేవనే చెప్పాలి. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామం… చారిత్రక ఘట్టానికి వేదిక అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌..ఈ గ్రామం నుంచే ప్రారంభం అయ్యింది.

ధరణి సందేశం :-
ధరణి పోర్టల్ ప్రారంభించిన అనంతరం గ్రామ శివారులో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ధరణి సందేశం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్‌. రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాలించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం భావించింది. అగ్రికల్చర్.. నాన్ అగ్రికల్చర్‌లుగా విభజించి నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది.




ఆస్తుల వివరాలు నమోదు ప్రక్రియ :-
ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను అక్టోబర్ 15లోపు పూర్తి చేసి.. దసరా రోజున పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. వర్షాలు, వరదల కారణంగా.. నమోదు ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వివ‌రాల నమోదు ప్రక్రియ వేగంగా జ‌రిగి‌నట్లు అధికారులు చెబుతున్నారు. రూర‌ల్ ఏరియాల్లో ఆస్తుల వివ‌రాలు సేకరించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శలకు అప్పగించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మున్సిపల్ అధికారులు వివరాలు నమోదు చేశారు.

తెలంగాణలో 62.68 లక్షల ఇళ్లు :-
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 62.68 లక్షల ఇళ్లున్నాయి. అందులో సోమవారం నాటికి 58.40 లక్షల ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేశారు. వరదల కారణంగా హైదరాబాద్‌లో ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. అగ్రికల్చర్ భూములకు సంబంధించి సమాచారం ఆన్‌లైన్‌లో ఉంది. పోర్టల్ ప్రారంభమైన తర్వాత కూడా నమోదు ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఇళ్ల వివరాలను అధికారులు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.




భూముల క్రయవిక్రయాల నిలిపివేత :-
కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నందున.. సెప్టెంబర్‌ 8 నుంచి తెలంగాణలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అవన్నీ ధరణి ప్రారంభం తరువాత తిరిగి మొదలు కానున్నాయి. ఇప్పటికే తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లను ట్రయల్స్ చేశారు. ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు.

మోసాలు ఇక ఉండవు :-
ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌ చోసుకోవచ్చు. ప్రతి అంగుళం భూమి భద్రంగా నిక్షిప్తమై ఉంటుంది. పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు పొందవచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మాన్యువల్‌ రికార్డులకు తెరపడుతుంది. ఇకపై భూ రికార్డుల నిర్వహణ డిజిటలైజ్ అవుతుంది. ధరణి పోర్టలే భూ హక్కు రికార్డుగా పరిగణించబడుతుంది.




ఆన్ లైన్ లో సమస్యలు :-
యజమాని ఆధార్‌ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు ఉంటాయి. అక్రమంగా భూ యాజమాన్య హక్కులు మార్చే ఆస్కారం ఉండదు. యజమాని వేలి ముద్రతోనే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇకపై సమస్యలకోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. సమస్యలను ఆన్‌లైన్‌లో తెలిపితే వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఆన్‌లైన్‌లోనే భూ రికార్డులను ఎప్పుడైనా చూసి తెలుసుకునే వీలుంటుంది. ఒకే భూమికి వేర్వేరు రికార్డుల సమస్యకు ధరణితో ఫుల్‌స్టాప్‌ పడనుంది.

భూ రికార్డులు మార్చే సంస్కృతికి అడ్డుకట్ట :-
ఇకపై ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా అనేది ఇట్టే తెలిసిపోతుంది. భూ హక్కులపై సందిగ్థతకు ధరణితో తెరపడుతుంది. అడ్డగోలుగా భూ రికార్డులను మార్చే సంస్కృతికి అడ్డుకట్ట పడుతుంది. రైతులు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.