తెలంగాణ‌లో డిజిట‌ల్ విప్ల‌వం, రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యం – కేటీఆర్

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 01:46 PM IST
తెలంగాణ‌లో డిజిట‌ల్ విప్ల‌వం, రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యం – కేటీఆర్

తెలంగాణ‌లో డిజిట‌ల్ విప్ల‌వం రాబోతోంది. ఇప్ప‌టికే టీ-ఫైబ‌ర్‌తో ప్రభుత్వం పునాదులు వేసిన కేసీఆర్ సర్కార్.. డిజిటల్ విప్లవానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్న కేటీఆర్.. మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.



క‌రోనా సంక్షోభం మొద‌లైన త‌ర్వాత ప్ర‌పంచం.. డిజిటిలీకరణ వైపు పయనిస్తోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు తెలంగాణ‌ ప్రభుత్వం ముందుచూపుతో ప‌ని చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ తో బ‌ల‌మైన పునాదులు వేసింది. త్వ‌ర‌లోనే టి-ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించనుంది.

మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. ఇంట‌ర్నెట్ అవ‌కాశాల‌ను అంది పుచ్చుకునేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వనుంది ప్రభుత్వం.



ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన టిఎస్ ఐపాస్ తో తెలంగాణ పారిశ్రామిక రంగ‌లో దూసుకుపోతోంది. ప్రపంచ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సేఫ్ జోన్ గా మారింది. ఇదే ఒర‌వ‌డిని క‌రోనా సంక్ష‌భం ముగిసిన త‌ర్వాత కూడా కొన‌సాగిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖామంత్రి కేటీఆర్ అన్నారు.

ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్ పేరుతో సీఐఐ నిర్వహించిన‌ వర్చువల్ కాన్ఫరెన్సులో కేటీఆర్ పాల్గొన్నారు. సిఐఐ రూపొందించిన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్‌ను విడుదల చేశారు.



తెలంగాణ ప్రభుత్వం పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టేందుకు 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుంద‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్న కేటీఆర్.. మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

టి హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్ట్ అప్ ఈకో సిస్టంలో మార్పుకు నాంది ప‌లికింద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే హైదరాబాద్ స్టార్ట్ అప్ క్యాపిటల్ గా మార‌బోతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి రంగ‌ంలోనూ తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంట‌డ‌ట‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ముందుకెళుతోందన్నకేటీఆర్.. దాన్ని త్వ‌ర‌లోనే సాధిస్తామ‌ని విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.