తెలంగాణలో డిజిటల్ సర్వే, ధరణి సక్సెస్ – సీఎం కేసీఆర్

తెలంగాణలో డిజిటల్ సర్వే, ధరణి సక్సెస్ – సీఎం కేసీఆర్

Digital Survey in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు త్వరలోనే డిజిటల్‌ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌ ఇవ్వనున్నారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందన్నారు సీఎం కేసీఆర్‌. రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.

రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పని తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయిందని, నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగిందని అధికారులకు తెలిపారు సీఎం కేసీఆర్‌. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగిందని, జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగిందన్నారు.

ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారం అవుతాయన్నారాయన. అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తామని, ప్రతీ భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్‌.