జీహెచ్ఎంసీలో ఎన్నికల వేళ, బీజేపీలో భగ్గుమంటున్న అసంతృప్తులు

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 10:13 PM IST
జీహెచ్ఎంసీలో ఎన్నికల వేళ, బీజేపీలో భగ్గుమంటున్న అసంతృప్తులు

Dissatisfaction in Telangana BJP : తెలంగాణ బీజేపీలోఅసంతృప్తి భగ్గుమంటోంది. ఓవైపు టికెట్లు కావాలంటూ కార్యకర్తలు చొక్కాలు చించుకుని పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తే… మరోవైపు ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అధినాయత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో.. గ్రేటర్ ఎన్నికల వేళ పార్టీలో లుకలుకలు నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మొన్న కూకట్‌ పల్లి, నిన్న కుత్బుల్లాపూర్‌.. ఇప్పుడు గన్‌ ఫౌండ్రి.. బీజేపీలో అసంతృప్తి సెగలు మిన్నంటుతున్నాయి. టికెట్ల గొడవ బాగా ముదిరింది.



తాజాగా ఆ పార్టీ నేత.. గోషామహల్ ఎమ్మెల్యే ఏకంగా అధినాయత్వంపైనే ఫైరయ్యారు. మూడు.. నాలుగు రోజుల క్రితం రాజాసింగ్ రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. అయితే.. అనుచరుల ఒత్తిడితో వెనక్కి తగ్గారని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఆ లోపే.. రాజాసింగ్ ట్విట్టర్ పేజ్‌లో పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుతో గ్రేటర్‌లో నాయకులు ఆగ్రహంగా ఉన్నారన్నది ఆ ట్వీట్ సారాంశం.



ఇప్పటికైనా బీజేపీ కేంద్ర అధిష్టానం జోక్యం చేసుకొని బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఉన్న ఆ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రాజాసింగ్ స్వయంగా స్పందించారు. ఓ ఆడియోను విడుదల చేశారు. ఆ ఆడియోలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎదురు తిరిగినట్లుగా ఉంది. తన వర్గానికి టికెట్లు కేటాయించకుండా బండి సంజయ్ మోసం చేశారంటూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్‌ఫ్రౌండ్రి, బేగంబజార్ టికెట్లు తన అనుచరులకు కేటాయించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో.. రాజాసింగ్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ కేంద్ర అధినాయత్వానికి అన్ని విషయాలపై లేఖ రాయాలని అనుకుంటున్నారు.



రాజాసింగ్ ఒక్కరే కాదు… గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో అసంతృప్త జ్వాలలు భగ్గుమంటున్నాయి. బీజేపీ కార్యాలయంలో గన్‌ఫౌండ్రి నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయంలోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. శైలేందర్ యాదవ్, ఓం ప్రకాష్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్‌ ఎలా ఇస్తారంటూ ఘర్షణకు దిగారు.
మొన్నటికి మొన్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో టికెట్లను అమ్ముకున్నారంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ కార్యాలయంలో ధ్వంసానికి దిగారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారంటూ రచ్చరచ్చ చేశారు.